తాము అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు చేరే ఫార్ములా త‌ర‌హా చిత్రాల్లో న‌టిస్తేనే జ‌నం చూస్తారని, అందుకు భిన్న‌మైన చిత్రాల్లో న‌టిస్తే ఇమేజ్ దెబ్బ తింటుంద‌ని, అభిమానులు కూడా అంగీక‌రించ‌ర‌ని  భావిస్తూ మూస చిత్రాలకే ప‌రిమితం కావ‌డం సినీ ప‌రిశ్ర‌మ‌లో స‌హ‌జం. మ‌రీ ముఖ్యంగా మాలీవుడ్ మిన‌హా ద‌క్షిణాది చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ఇది మ‌రింత ఎక్కువ‌గా వ‌ర్తిస్తుంది. ఇక్క‌డ చాలాకాలం పాటు మాస్ సినిమాల‌దే రాజ్యం. పాట‌లు, ఫైట్లు, ఓ ఐటం సాంగ్.. ద‌శాబ్దాలుగా ఇదే ఫార్ములా. నిజానికి గ‌త త‌రం హీరోలైన ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ‌, శోభ‌న్‌బాబు, కృష్ణంరాజు వంటి న‌టుల‌కు ద‌క్కిన‌న్ని విభిన్న‌మైన పాత్ర‌లు ఆ త‌రువాత త‌రం హీరోలు చేయ‌లేక‌పోయార‌నే చెప్పాలి. వారి హ‌యాంలో హీరోయిన్ కు కూడా స‌మాన‌ ప్రాధాన్య‌మున్న క‌థ‌ల్లో న‌టించేందుకు కూడా వారేమీ వెనుకాడేవారు కాదు. అంతేకాదు.. డీ గ్లామ‌ర‌స్ పాత్ర‌లు కూడా. ఎన్టీఆర్ న‌టించిన క‌ల‌సి ఉంటే క‌ల‌దు సుఖం సినిమాలో అవిటివాడిగా ఆయ‌న పాత్రను ఈ సంద‌ర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలి. అందుకే  అప్ప‌టి సినిమాలు ఇప్ప‌టికీ అంద‌రికీ గుర్తుండిపోయాయి. ఆ తరువాత త‌రం హీరోలు మాస్ ఇమేజ్ చ‌ట్రంలో ఇరుక్కుపోయారు.
 
    మెగా స్టార్ చిరంజీవి గొప్ప న‌టుడు. కానీ ఆయ‌న లోని స్టార్ ను మాత్ర‌మే చూడ‌టానికి ఇష్ట‌ప‌డిన అభిమానులు, న‌టుడిని కూడా చూడాల‌ని ఆశించి ఉంటే తెలుగు చిత్రాలు ఎన్నో జాతీయ అవార్డుల‌ను సొంతం చేసుకుని ఉండేవేమో. బాల‌కృష్ణ‌, నాగార్జునకు సైతం ఇదే వ‌ర్తిస్తుంది. ఆ త‌రం హీరోల్లో వెంక‌టేష్ మాత్ర‌మే ఈ ఇమేజ్ చ‌ట్రంలో ఇరుక్కోకూడ‌ద‌న్న స్పృహ‌తో కాస్త భిన్న‌మైన క‌థ‌ల‌ను ప్ర‌య‌త్నిస్తూ వ‌చ్చారు. త‌మిళ‌నాట కూడా దాదాపు ఇదే ప‌రిస్థితి. ర‌జ‌నీకాంత్ ఈ ఇమేజ్‌ త‌ప్పించుకోవాల‌ని చూసినా ఆయన అభిమానులు ఒప్పుకోలేదు. క‌మ‌ల్‌హాస‌న్ మాత్రం దీనికి మిన‌హాయింపు. అందుకే క‌మ‌ల్‌కు స్టార్‌గా మాత్ర‌మే కాకుండా గొప్ప న‌టుడిగానూ గుర్తింపు ఉంది. మ‌ల‌యాళ సినిమా మాత్రం స్టార్‌ల‌కంటే క‌థ‌ల‌కే ప్రాధాన్యం ఇస్తూ వ‌చ్చింది. అందుకే అక్క‌డ విభిన్న‌మైన క‌థ‌లు తెర‌కెక్కుతూ, ఇత‌ర భాష‌ల సినిమాల‌కూ ముడి స‌రుకుగా ఉప‌యోగ‌ప‌డుతున్నాయి. భ‌విష్య‌త్తులో ద‌క్షిణాది సినిమా ఆస్కార్ స్థాయిని అందుకోవాలంటే ప్రేక్ష‌కులు కూడా మారాలేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: