మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఇటీవల విడాకుల అనౌన్స్ మెంట్ తో అందరికీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. భార్య కిరణ్ రావుతో ఉన్న 15 సంవత్సరాల వివాహ బంధాన్ని విడాకులతో ముగించి అందరిని దిగ్భ్రాంతికి గురి చేశాడు. కానీ వారిద్దరూ స్నేహపూర్వకంగా విడిపోతున్నట్లు ప్రకటించారు. చెప్పినట్లుగానే తదుపరి రోజే "లాల్ సింగ్ చద్ధా" సినిమా షూటింగ్ లో తీసిన ఒక పిక్ లో ఇద్దరు కలిసి నవ్వుతూ కనిపించారు. దీంతో అప్పటివరకు షాక్ లో ఉన్న అమీర్ అభిమానులు ఒక్కసారిగా కూల్ అయిపోయారు. లడఖ్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా లోకేషన్ లో వారిద్దరూ సంతోషంగా ఉన్న వీడియోను షేర్ చేసుకున్నారు. అయితే అక్కడ వారు చేసిన పనికి తాజాగా ఇబ్బందుల్లో పడినట్లే కనిపిస్తోంది. లడఖ్ లోని ఒక గ్రామానికి సమీపంలో ఉన్న ప్రాంతంలో ఇరవై రోజుల షూటింగ్ జరగనుంది. తాజాగా చిత్రబృందం షూటింగ్ జరిపిన ప్రాంతాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఓ నెటిజన్. అతని వీడియో తీయడం కాదు... ఆ వీడియో ఎందుకు తీశాడు అనేది అసలు విషయం. 

ఆ వీడియోలో "లాల్ సింగ్ చద్దా" టీం షూటింగ్ చేసిన ప్రాంతంలో మొత్తం ప్లాస్టిక్ బాటిల్స్ కనిపిస్తున్నాయి. ఈ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేసిన ఆ నెటిజన్ "ఇది బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ చిత్రం 'లాల్ సింగ్ చద్దా' టీం లడఖ్ లోని వాఖ గ్రామస్తుల కోసం వదిలిపెట్టిన బహుమతి. అమీర్ ఖాన్ పర్యావరణ పరిశుభ్రత గురించి, సత్యమేవ జయతే అంటూ పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడుతుంటాడు. కానీ అసలు విషయం ఇలా ఉంటుంది" అంటూ ట్వీట్ చేశాడు. ఇంకేముంది నెటిజన్లు ఈ వీడియోని వైరల్ చేస్తూ అమీర్ ని ఏకిపారేస్తున్నారు. చేసేది ఒకటి చెప్పేదొకటి అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. మరి వీడియోపై అమీర్ ఖాన్ రియాక్షన్ ఏంటో చూడాలి. కాగా ఈ షెడ్యూల్ లో యుద్ధ సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ లో టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య కూడా జాయిన్ అయిన విషయం తెలిసిందే. ఇందులో చైతన్య బాలా అనే కీలక పాత్రలో కన్పించబోతున్నారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: