పక్కింటి అబ్బాయిలా కనిపించే శర్వానంద్‌కి ప్రేక్షకుల్లో సూపర్ క్రేజ్ ఉంది. మంచి నటుడిగా ఇప్పటికే మంచి మార్కులు కొట్టేశాడు. జనాల్లో బెస్ట్‌ పెర్ఫామర్‌ అనే ఇమేజ్‌ కూడా ఉంది. ఎలాంటి కథకైనా న్యాయం చేస్తాడనే మంచి ఒపీనియన్‌ ఉంది. కానీ సినిమా సినిమాకి ఈ ఆలోచనలు మారిపోతున్నాయి. వరుస ప్లాపులతో శర్వా డౌన్ అవుతున్నాడు. దీంతో జనాల్లో కూడా నమ్మకం తగ్గిపోతోందనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ఆ మచ్చను తొలగించుకునేందుకు శర్వానంద్ బాగానే కష్టపడుతున్నాడు. ఏరికోరి స్టోరీలు ఎంచుకొని సినిమాలు చేసినా.. తన గ్రాఫ్ మారడం లేదు.  

శర్వానంద్ 'మహానుభావుడు' తర్వాత మళ్లీ ఆ స్థాయిలో ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయాడు. 'పడిపడి లేచే మనసు, రణరంగం' సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర బోల్తాపడితే, 'జాను, శ్రీకారం'కి పాజిటివ్ రివ్యూస్‌ వచ్చినా, వసూళ్లు రాలేదు. దీంతో శర్వానంద్ మార్కెట్‌లోనూ తేడాలొచ్చేశాయి.

శర్వానంద్‌ కంపల్సరీగా హిట్‌ కొడితేనే మార్కెట్‌లో నిలబడతాడు అనే టైమ్‌లో అజయ్ భూపతి దర్శకత్వంలో 'మహాసముద్రం' సినిమా చేశాడు. సిద్ధార్థ్, శర్వానంద్‌ హీరోలుగా నటించిన ఈ సినిమాకి జనాలు పెద్దగా కనెక్ట్ కాలేదు. పైగా 'రణరంగం' పోయాక కూడా మళ్లీ ఇలాంటి కథే చెయ్యాలా అని విమర్శలు కూడా వస్తున్నాయి.

శర్వానంద్‌ ఫ్లాపుల నుంచి బయటపడకపోవడంతో స్టోరీ సెలక్షన్‌పై కామెంట్స్‌ వస్తున్నాయి. శర్వా కథలు ఎంచుకోవడంలో తడబడుతున్నాడని, ఇక నుంచి మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు సినీ జనాలు. మరి ఇప్పుడు పైప్‌లైన్‌లో ఉన్న 'ఒకే ఒక జీవితం, ఆడవాళ్లు మీకు జోహార్లు'  సినిమాతో అయినా మళ్లీ ట్రాక్‌లోకి వస్తాడేమో చూడాలి. శర్వానంద్ ప్రస్థానం సినిమాలో నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అలాంటి హిట్ శర్వాకు అర్జంట్ గా అవసరమని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. చూద్దాం... శర్వానంద్ కు ఆడవాళ్లు మీకు జోహార్లు హిట్ ఇస్తుందో లేదో. ఆయనకు అంతా మంచి జరగాలని ఆల్ ది బెస్ట్ చెబుదాం.

మరింత సమాచారం తెలుసుకోండి: