దివంగ‌త నంద‌మూరి తార‌క రామారావు మొద‌టి భార్య త‌న మ‌ర‌ద‌లు బ‌స‌వ రామ‌తార‌కం. ఈ భార్య భ‌ర్త‌ల మ‌ధ్య ఎంతో అన్యోన్న‌మైన సంబంధం ఉండేది. తన సతీమణి బసవరామతారకంగారి గురించిన ఓ సందర్భాన్ని 1990లో ఎన్టీఆర్ ఓ విలేఖరితో పంచుకున్న వ్యాఖ్య‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ''చిరంజీవులు చిత్రంలో నాకు కాంటాక్ట్ లెన్స్ పెట్టారు. భోజనం లేకుండా, నిద్రలేకుండా - పాత్రమీద ఏకాగ్రతతో రాత్రీ పగలూ షూటింగ్ లో పాల్గొనడం వలన కంటి చూపు దెబ్బతింది. డాక్టరుగారు పరీక్షించి పూర్తి విశ్రాంతి అవసరమని, కదల కూడదని చెప్పారు. పడుకుని నిద్రపోయాను. రెండు రోజులు గడిచాయి. నెమ్మదిగా కళ్ళు తెరిస్తే అంధకారం. మళ్ళీ నిద్రపోయాను. మూడవ రోజున కళ్ళు తెరిస్తే మిణుకు మిణుకుమంటూ చిన్న వెలుతురు కనిపించేసరికి నాకు ఆశ జనించింది.


ఇక నాల్గవరోజుకు చూపు స్పష్టమైంది. అప్పుడు లేచి మూసివున్న తలుపు తెరిచాను. ఆవిడగారు (శ్రీమతి బసవరామతారకంగారు) అచేతనంగా గుమ్మం దగ్గర కూలబడి ఉన్నారు. 'ఏమిటిలా పడుకున్నారు?' అని అడిగాను. అండీ అని సంబోధించడం మా అలవాటు. ''మీరు నిర్దయతో, నిర్దాక్షిణ్యంగా- మాకెవరికీ చెప్పకుండా, నన్నూ మరిచిపోయి మనోవేదనతో- ఒంటరిగా గెడవేసుకుని గదిలో ఉండిపోతే మాకెలా ఉంటుంది?'' అంటూ గుండెపగిలే వేదనతో, దుఃఖంతో అన్నారామె. చలించిపోయాను. ఎక్కడికీ వెళ్ళక. ఏమీ చేయక, ఏమి చేయాలో తోచక, కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా- నా ఆరోగ్యం కోసం అల్లాడిపోయిన ఆమెలో- అర్ధాంగే కాదు... అనురాగం నిండారిన ఓ దేవతామూర్తి కన్పించింది. 'జీవన సహభాగిని' అనే పదానికి అంకితమైన భావంతో కూడిన ఆ పుణ్య స్మృతి- ఆనాటి నుండి నాలో అలాగే నిలచిపోయింది.'' అన్నారు ఎన్టీఆర్.


అర్ధాంగి బసవరామతారకంగారంటే ఎన్టీఆర్ కు అంతటి గౌరవం, ఆరాధనా భావం ఉండేవి. ఎన్టీఆర్ జీవనసాఫల్యానికి చుక్కానిలా నిలిచారు శ్రీమతి బసవరామ  తారకమ్మగారు. ఈరోజు ఆ పుణ్యదంపతుల పెళ్ళిరోజు. 1942లో మే 2వ తేదీన కొమరోలు గ్రామంలో వారి వివాహం జరిగింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: