
ఈ ప్రకటన చిత్ర పరిశ్రమలతో పాటు సినీ లవర్స్ ను కూడా ఉలిక్కి పడేలా చేసింది. ఇందుకు కారణం లేకపోలేదు. జూన్ నెలలో ‘థగ్ లైఫ్’, ‘హరి హర వీరమల్లు’, ‘కుబేర’, ‘కన్నప్ప’ వంటి భారీ బడ్జెట్ సినిమాలు విడుదలకు క్యూ కట్టాయి. థియేటర్స్ బంద్ నిర్ణయం ఆయా చిత్రాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. అయితే పర్సెంటేజ్ విధానంపై కొందరు నిర్మాతలు పాజిటివ్‌గానే ఉన్నా.. కొందరు మాత్రం అనాసక్తి కనబరుస్తున్నారు. పర్సెంటేజ్ విధానంలో సినిమాలు ఆడితే తమకొచ్చే నష్టం, తమపై పడే భారం, దానిని ఎలా తగ్గించుకోవాలనే అంశాలపై చర్చించుకుంటున్నారు.
బుధవారం సాయంత్రం ఫిల్మ్ ఛాంబర్ లో సపరేట్ గా జరిగిన డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ మీటింగ్ లో ఎటూ వారు తేల్చుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే ఫిల్మ్ ఛాంబర్ నేతృత్వంలో ప్రొడ్యూసర్, ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్ మూడు సెక్టార్స్ నుండి కొంతమందిని ఎంపిక చేసి ఓ కమిటీని వేసి సమస్యకు పరిష్కరించమని కోరబోతున్నారట. మే 24, శనివారం నాడు మూడు సెక్టార్లకు సంబంధించి వేసే జాయింట్ కమిటీ మీటింగ్ జరగనుందని తెలుస్తోంది.
ఆ రోజు మొత్తం రెంటల్, పర్సంటేజ్ విధానాల్లో సినిమాలను ఆడిస్తే వచ్చే నష్టాలపై సమగ్రంగా చర్చించి, తుది నిర్ణయానికి రానున్నారట. థియేటర్స్ బంద్ అంశంపై కూడా అదే రోజు ఓ స్పష్టత రానుందని అంటున్నారు. ఏదేమైనా వచ్చే నెలలో పెద్ద చిత్రాలు విడుదలకు రెడీ అయ్యారు. తమ డిమాండ్స్ ను నెరవేర్చుకునేందుకు ఇదే మంచి ఛాన్స్ అని ఎగ్జిబిటర్స్ భావిస్తున్నారు. కాబట్టి వారు కోరినట్టుగా పర్సంటేజ్ సిస్టమ్ కు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఓకే చెబితేనే సమస్య పరిష్కారం అయ్యేలా కనిపిస్తోంది.