ఐదేళ్లుగా నటసింహ నందమూరి బాలకృష్ణ కెరీర్ గర్జనతోనే సాగుతోంది. వరుసగా నాలుగు సినిమాలు – అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ – అన్నీ బ్లాక్‌బస్టర్ హిట్స్. ఒక్కొక్కటి వంద కోట్ల మార్క్ దాటాయి. ఈ నాలుగు సినిమాలతో బాలయ్య పేరు మీద ఒక యూనిక్ రికార్డు నమోదైంది. తన సమకాలీకులైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఎవరూ సాధించని వరుస హిట్స్ సిరీస్‌ని బాలయ్య క్రియేట్ చేశాడు. అందుకే ఇప్పుడు అభిమానుల కళ్లంతా ఒకే లక్ష్యం మీద ఉన్నాయి – డబుల్ హ్యాట్రిక్!


అఖండ 2 తో రికార్డుల వేట .. ప్రస్తుతం బాలయ్య చేస్తున్న అఖండ 2 సినిమాపై పాన్ ఇండియా రేంజ్‌లో హంగామా నెలకొంది. బాక్సాఫీస్ దగ్గర ఇది కేవలం 100 కోట్లే కాదు, బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్ల చిత్రం అవుతుందని ట్రేడ్ టాక్. అభిమానుల అంచనాలు ఆకాశమే హద్దు. బాలయ్యకు ఇది మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో, రిలీజ్ రోజున బాక్సాఫీస్ లెక్కలు చెరిపేయడం ఖాయమంటున్నారు ట్రేడ్ వర్గాలు. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరుగుతోంది. అఖండ 2 తర్వాత బాలయ్య మరోసారి డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో చేతులు కలపనున్నారు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన వీరసింహారెడ్డి భారీ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా 134 కోట్ల వసూళ్లతో సెన్సేషన్ సృష్టించింది. అదే ట్రాక్‌లో మళ్లీ గోపీకి అవకాశం ఇవ్వడం బాలయ్య విశ్వాసాన్ని చూపిస్తోంది.



గోపీచంద్ మలినేని ఇప్పటివరకు ఎనిమిది సినిమాలు చేస్తే, ఏడు సక్సెస్ కావడం అతని ట్రాక్ రికార్డేంటో చెబుతోంది. తాజాగా బాలీవుడ్‌లో చేసిన జాట్ సినిమాతో కూడా హిట్ కొట్టాడు. నార్త్ ఆడియన్స్‌కి అసలైన మాస్ యాక్షన్ చూపించి, బాలీవుడ్‌లో కూడా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ కాన్ఫిడెన్స్, బాలయ్య స్టార్ పవర్ కలిస్తే రాబోయే సినిమా మరొక భారీ బ్లాక్‌బస్టర్ అవుతుందని నమ్మకం. అఖండ 2 ఊపుతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన వెంటనే గోపీచంద్ మలినేని సినిమాతో మళ్లీ బ్లాక్‌బస్టర్ వస్తే, బాలయ్య కెరీర్‌లో మొదటిసారి డబుల్ హ్యాట్రిక్ నమోదవుతుంది. ఈ రికార్డు కూడా బాలయ్యకే యూనిక్‌గా మిగిలిపోతుంది. అభిమానులు ఇప్పటికే డిసెంబర్ లేదా సంక్రాంతి బరిలో సింహం గర్జన కోసం ఎదురుచూస్తున్నారు. “బాలయ్య సినిమా అంటే బాక్సాఫీస్ దుమ్మే… ఈసారి డబుల్ హ్యాట్రిక్ ఖాయం!” అని నందమూరి ఫ్యాన్స్ గర్వంగా చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: