
కొద్ది రోజుల్లో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వస్తున్న “ఓజి” చిత్రం విడుదల కానుండటంతో అభిమానుల్లో ఉత్సాహం స్కై రేంజ్‌లో ఉంది. గత కొద్ది నెలలుగా ఈ సినిమా గురించి రకరకాల అప్‌డేట్లు వచ్చినా రిలీజ్ డేట్ సమీపిస్తున్నకొద్దీ క్రేజ్ మరింతగా పెరుగుతోంది. ప్రస్తుతానికి బయట సౌండ్ అంతగా లేదనిపించినా, రిలీజ్ రోజు నాటికి ఏర్పడే వాతావరణం ఊహించుకోవడం కూడా కష్టమనే స్థాయిలో ఉందన్న చర్చలు టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇప్పుడీ సినిమాకు సంబంధించి అభిమానులు ప్రధానంగా చర్చిస్తున్న అంశాలు రెండు. మొదటిది టికెట్ రేట్లు. ఇటీవలి కాలంలో ఏపీలోనూ, తెలంగాణలోనూ చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని సినిమాలకు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు ఇస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే డివివి ఎంటర్టైన్మెంట్స్ ఈ అవకాశాన్ని వాడుకుంటుంది. ఇన్‌సైడ్ టాక్ ప్రకారం ఏపీలో కనీసం వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు పెంపు ఉండొచ్చంటున్నారు. తెలంగాణలో పరిస్థితి కొంచెం వేరేలా ఉంది. అక్కడ ఇప్పటికే మల్టీప్లెక్స్‌లలో గరిష్ట టికెట్ ధర రు. 295గా ఉంది. దానికి ఎంతవరకు హైక్ ఇస్తారనేది స్పష్టత రానందున అభిమానుల్లో ఆతృత పెరుగుతోంది. ఇక రెండోది ప్రీమియర్ షోలు. అభిమాన సంఘాలు ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్ల మీద ఒత్తిడి పెడుతూ, అర్థరాత్రి ఒంటి గంట నుంచి షోలు వేయాలని కోరుతున్నాయి. గతంలోనే పవన్ కళ్యాణ్ సినిమాల ప్రీమియర్ రేట్లు రెట్టింపు స్థాయికి చేరాయి.
“హరిహర వీరమల్లూ” ప్రీమియర్స్‌కు 600 రూపాయల వరకు వసూలు చేసిన సందర్భం ఉంది. ఇక “ఓజి” క్రేజ్ దానికి ఏమాత్రం తీసిపోని స్థాయిలో ఉంది. ఇప్పటివరకు హయ్యెస్ట్ ప్రీమియర్ రికార్డు “పుష్ప 2: ది రూల్” పేరుతో ఉంది. ఆ సినిమా కోసం 800 నుంచి 1000 రూపాయల మధ్య రేట్లు నిర్ణయించి, ముందురోజే రెండో షోలు వేసి మైత్రి మూవీస్ కొత్త ట్రెండ్ మొదలుపెట్టింది. “ఓజి”కి కూడా అలాంటి బజ్ ఏర్పడింది. కానీ ఇక్కడే సమస్య ఉంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీలో డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నారు. ఆయన సినిమాకు భారీ పెంపు ఇస్తే అది ప్రతిపక్షాలకి రాజకీయ ఆయుధం కావొచ్చన్న భయమూ డిస్ట్రిబ్యూటర్లలో ఉంది.
అయినా థియేటర్లలో అధికారికంగా ఎంత పెట్టినా, బయట బ్లాక్ టికెట్ రేట్లు మాత్రం తప్పనిసరిగా వెయ్యి నుంచి ఐదు వేల రూపాయల వరకు ఎగబాకుతాయని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే భారీ అంచనాలు రేపిన “ఓజి” విడుదలకు కౌంట్‌డౌన్ మొదలైంది. టికెట్ రేట్లు, ప్రీమియర్ రికార్డులు ఎలాగున్నా, రిలీజ్ రోజు అభిమానులు థియేటర్ల వద్ద పండుగ వాతావరణం సృష్టించడం మాత్రం ఖాయం.