ఇదే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన విషయం బయటకొచ్చిన వెంటనే చాలా మంది సంబరపడుతున్నారు. “ఇప్పుడైనా టాలీవుడ్‌కి మంచి రోజులు వస్తాయి”, “ఇక పైరసీ తగ్గిపోతుంది” అని ఆనందంగా పోస్టులు పెడుతున్నారు. అయితే అదే సమయంలో కొంతమంది నెటిజన్లు మాత్రం అసలు సమస్యను గట్టిగా ఎత్తిపొడుస్తున్నారు. వారి వాదన ఏమిటంటే— “పైరసీని నడిపేది రవి ఒక్కడే కాదు. ఇంకా వందలాది ఇల్లీగల్ సైట్లు ఉన్నాయి. రిలీజ్ రోజే సినిమాలను డౌన్‌లోడ్ చేసుకునే ప్లాట్‌ఫార్ములు ఇంకా బాగానే ఉన్నాయి. మరి వాటి పరిస్థితి ఏమైంది?”


ఈ ప్రశ్నకు ఇప్పటివరకు స్పష్టమైన సమాధానం ఎవరూ ఇవ్వలేదని, కేవలం రవిని అరెస్టు చేయడం వల్లే “పైరసీ పూర్తిగా అంతమైంది” అని చెప్పడం చాలా అతిశయోక్తి అని నెటిజన్లు వాదిస్తున్నారు. కొంతమంది మరింత ఘాటుగా స్పందిస్తూ, “ఒక్క ఐబొమ్మ రవిని పట్టుకున్నామంటే పైరసీని నిర్మూలించామన్నట్టేనా? అసలు ఈ వ్యవస్థను నడిపేది పెద్ద నెట్‌వర్క్. అందరినీ పట్టుకున్నప్పుడే నిజంగా ఇండస్ట్రీకి మంచి రోజులు వస్తాయి” అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే సమయంలో రవికి సంబంధించిన వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియాలో చర్చకు తెస్తున్నారు. రవి స్వతహాగా మంచి వ్యక్తి అని, అతన్ని రెచ్చగొట్టి తప్పుదోవ పట్టించినది అతని భార్యేనన్న ప్రచారాన్ని కొంతమంది విపరీతంగా షేర్ చేస్తున్నారు. “ముందు రవి భార్యను కూడా విచారించండి, ఆమెపై పోలీస్ కేసు పెట్టాలి” అంటూ తీవ్రంగా స్పందిస్తున్న వర్గాలు కూడా ఉన్నాయి.



ఇక మరో వైపు—అరెస్టయిన తర్వాత ఐబొమ్మ రవికి వచ్చిన అనూహ్యమైన పాప్యులారిటీపై కూడా నెట్‌లో చర్చ నడుస్తోంది. ఓ టాప్ మోస్ట్ సెలబ్రిటీకి ఉంటే ఉండేంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పుడు రవికి వచ్చేసిందని కొందరు అంటున్నారు. అతని తెలివి, టెక్నికల్ స్కిల్స్, సర్వర్ మేనేజ్‌మెంట్‌ గురించి ప్రశంసలు వెల్లువెత్తుతుంటే, మరికొందరు మాత్రం అతడ్ని పచ్చి బూతులతో దూషిస్తున్నారు. “టాలెంట్ ఉందని అన్నీ చేస్తే కుదరదు. ఇండస్ట్రీ శ్రమను మింగేసిన వ్యక్తి గుర్తింపు అర్హించుకోడు”అంటూ మండిపడుతున్న వాళ్లు కూడా ఉన్నారు.



మొత్తానికి—ఐబొమ్మ రవి అరెస్టు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఒకవైపు అతన్ని పట్టుకోవడం ప్రభుత్వం, పోలీసుల విజయం అని కొంతమంది చెప్పుకుంటుంటే, మరోవైపు అసలు నెట్‌వర్క్ మొత్తాన్ని కూల్చకపోతే సమస్య తొలగదని మరికొందరు వాదిస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇది ఒక్క అరెస్టుతో ముగిసే కథలా కనిపించడం లేదు. పైరసీ వ్యవస్థ ఎంత పెద్దదో, దానిని పూర్తిగా ఆపడానికి ఇంకా ఎంత పని మిగిలి ఉందో సోషల్ మీడియా మళ్లీ గుర్తు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: