ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో కీలక మార్పుల దిశగా చర్యలు తీసుకుంటున్నారు. రేషన్ లబ్ధిదారులు బియ్యం వద్దనుకుంటే వారికి నగదు పంపిణీ చేసే విధంగా చర్యలు చేపడుతున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ ఈ దిశగా అడుగులు వేసినా కొన్ని కారణాల వల్ల వెనక్కు తగ్గింది. అయితే తాజాగా మంత్రివర్గ ఉపసంఘం చేసిన ఈ సిఫారసును ప్రభుత్వం ఆమోదించింది.
 
జగన్ సర్కార్ త్వరలో ఈ పద్ధతిని ప్రయోగాత్మకంగా చేపట్టనుందని తెలుస్తోంది. కిలో బియ్యానికి 25 రూపాయల నుంచి 30 రూపాయల చొప్పున ఇవ్వాలని జగన్ సర్కార్ భావిస్తోంది. ప్రభుత్వం మొదట ప్యాకెట్ల ద్వారా బియ్యం పంపిణీ చేయాలని భావించి తాజాగా ఆ విధానానికి స్వస్తి పలకాలని యోచిస్తోంది. నూతన డోర్ డెలివరీ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒక వాహనం ద్వారా ఇంటింటికీ సరుకుల పంపిణీ జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
 
గతంలో ప్రతిపాదించిన విధానం ద్వారా 717 కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉండగా తాజా విధానం వల్ల ఆ భారం సగానికి సగం తగ్గనుందని తెలుస్తోంది. రాష్ట్రంలో ఉన్న కోటిన్నర రేషన్ కార్డుదారుల కోసం ఏకంగా 9,260 వాహనాలు అవసరం అవుతాయని సమాచారం. అయితే ప్రభుత్వం వాహనాలను నేరుగా కొనకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చి కొనుగోలు చేయించాలని భావిస్తోందని తెలుస్తోంది.
 
వాహనం కొనుగోలు ఖర్చులో 10 శాతం లబ్ధిదారు భరించాల్సి ఉండగా 30 శాతం రుణం, 60 శాతం కార్పొరేషన్ల ద్వారా ఇప్పించడం కొరకు కార్పొరేషన్లతో పౌర సరఫరాల శాఖ ఒప్పందం చేసుకుందని సమాచారం. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ప్రజలకు ప్రయోజనం కలగనుంది. ఏపీలో చాలామంది రేషన్ బియ్యం తినడానికి ఆసక్తి చూపడం లేదు. అలాంటి వాళ్లకు ఈ నిర్ణయం వల్ల ప్రయోజనం కలగనుంది.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: