ఏపీలో తిరుమల తర్వాత అంతటి ప్రసిద్ధి చెందిన ఆలయం.. బెజవాడ దుర్గమ్మ గుడి. దసరా ఉత్సవాల సమయంలో.. భవానీ దీక్షల వేళ.. ఇక్కడి వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. దుర్గమ్మను కొలిచి దర్శనం చేసుకుంటారు. ఇక సాధారణ రోజులతోపాటు సెలవు రోజుల్లో కూడా అమ్మవారి దర్శనానికి వేలసంఖ్యలో భక్తులు వస్తుంటారు. అమ్మవారి ఆదాయం కూడా కోట్ల రూపాయల్లో ఉంటుంది. అయితే ఆలయ అభివృద్ధి అంతంతమాత్రంగానే ఉందనే ఆవేదన భక్తుల్లో కనిపించేది.

పెరుగుతున్న భక్తుల సంఖ్యకు తగ్గట్టుగా... ఆలయంలో అభివృద్ధి పనులు జరగలేదు. గత ప్రభుత్వ హయాంలో అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉన్న కట్టడాలను అన్నింటిని తొలగించారు. అయితే కొత్త నిర్మాణాలేవీ చేపట్టలేదు. దీనికితోడు కొండచరియలు అత్యంత ప్రమాదకరంగా మారాయి. ఇటీవల దసరా ఉత్సవాల సమయంలో కొండరాళ్లు జారిపడినప్పుడు తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఆలయంలో అనేక అభివృద్ధి పనులు కేవలం ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం నిధులు కేటాయించడంతో వీటన్నింటికి మోక్షం కలిగింది.

70 కోట్ల రూపాయల నిధులను 8 కీలక పనులకు విభజించారు. ఇందులో సింహభాగం కేశఖండనశాల నిర్మాణానికి కేటాయించారు. దుర్గగుడిలో అమ్మవారి ప్రసాదంగా పులిహోర, లడ్డు లభిస్తుంది. దీనికి సంబంధించిన పోటు గతంలో దుర్గగుడి కొండ మీద ఉండగా.. దాన్ని కొన్నాళ్ళ క్రితం కొండ దిగువకు మార్చేశారు. ఇది కూడా సరిపడా స్థలంలో లేకపోవటంతో.. విశాలమైన పోటును నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఎనిమిదిన్నర కోట్లను కేటాయించారు. దసరా సమయంలో లక్షల సంఖ్యలో లడ్డూల తయారీ జరుగుతుంది. వీటన్నింటికి ఇప్పుడు ఒకటే కేంద్రంగా పోటును నిర్మించనున్నారు. దీనితోపాటు తిరుమల కొండ మార్గానికి వెళ్ళేటపుడు ఏర్పాటు చేసిన విధంగా టోల్ ప్లాజాను ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ భారీ ఆర్చిని కూడా నిర్మించనున్నారు. ఇక దుర్గమ్మ ఆలయానికి సమాంతరంగా మల్లేశ్లరస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఇంద్రకీల్రాద్రిపై దుర్గమ్మ.. మల్లేశ్వరస్వామితో కలిసి కొలువు తీరటంతో దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంగా చెబుతారు. ఇప్పుడు మల్లేశ్వరస్వామి ఆలయాన్ని, ప్రాకారాన్ని ఏడున్నర కోట్లతో నిర్మించునున్నారు.

ఇక ఆలయంలో ఘాట్ రోడ్డులో అత్యంత ప్రమాదకరంగా మారిన కొండ చరియలు పడకుండా మరమ్మతులకు ఆరున్నక కోట్లను కేటాయించారు. కొండచరియల విషయంలో టెక్నికల్ బృందాలు ఇప్పటికే రెండుసార్లు పర్యటించి కీలక సూచనలు చేశాయి. వీటన్నింటిని ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్మించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: