ఇప్ప‌టిదాకా రాజ‌కీయం ఓ విధంగా ఉంటే ఇక‌పై రాజ‌ధాని మ‌రియు దాని అనుబంధ రాజకీయం మ‌రోలా ఉండ‌నుంది. నెల్లూరు  పెద్దారెడ్డిగా పేరున్న కోటంరెడ్డి (అక్క‌డి రూరల్ ఎమ్మెల్యే) త‌న దైన స్టైల్ లో రాజకీయాలు చేస్తార‌న్న‌పేరుంది. చాలా కాలంగా నెల్లూరు రెడ్లు జ‌గ‌న్ మాట విన‌క‌పోయినా శ్రీధ‌ర్ మాత్రం కాస్త భిన్నంగానే ఉన్నారు. విప‌క్షంలో ఉన్న‌ప్పుడు పార్టీకి మైలేజీ తీసుకురావ‌డంలో మంచి కృషి చేశారు. అదే టెంపోతో మొన్న‌టి ఎన్నిక‌ల్లో గెలిచారు. అయితే రాజ‌ధాని విష‌య‌మై ఎవ‌రి అభిప్రాయం ఎలా ఉన్నా త‌మ ప‌రిధిలో తమ ఇంటికి వ‌చ్చిన నేత‌ల‌ను కార్య‌క‌ర్త‌ల‌ను రైతుల‌ను గౌర‌వించుకోవ‌డంలో త‌ప్పేమీ లేదు. అలా చేస్తే ఇమేజ్ పెరుగుతుంది కూడా! కోటంరెడ్డి ఇమేజ్ పెంచుకునే ప‌నులే చేశారు ఇప్పుడు.


 మొన్న‌టి వ‌ర‌ద‌ల వేళ కూడా  చంద్ర‌బాబుకు న‌మ‌స్కారం చెప్పి చెవిరెడ్డి త‌న ఇమేజ్ పెంచుకున్నారు. ఏం కాదు అమ‌రావ‌తి రైతుల‌ను క‌లిసి సంఘీభావం చెప్పినంత మాత్రాన జ‌గ‌న్ కు కోపం వ‌చ్చినా రాక‌పోయినా శ్రీ‌ధ‌ర్ జీవితంలో పెద్ద‌గా మార్పుల‌యితే రావు. అంతేకాకుండా మిగ‌తా నాయ‌కుల క‌న్నా భిన్నంగా న‌డుచుకుని అటు వ‌ర్గం వారినీ ఆకట్టుకోవ‌డం మంచి వ్య‌క్తిత్వ ల‌క్ష‌ణం.

వైసీపీలో వీర‌విధేయుడిగా పేరున్న కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్ రెడ్డి త‌న రూటు మార్చారు. నెల్లూరు మేయ‌ర్ ప‌ద‌వి విష‌య‌మై త‌న పంతం నెగ్గించుకున్న కోటంరెడ్డి, తాజాగా అదే వేగంతో అంతే ఉత్సాహంతో అమ‌రావ‌తి రైతుల‌ను క‌లిశారు. త‌న నియోజ‌క‌వ‌ర్గం మీదుగా పాద‌యాత్ర చేస్తున్న అమ‌రావ‌తి రైతుల‌ను క‌ల‌వ‌డంతో పాటు ఏ అవ‌స‌రం ఉన్నా త‌న‌ను సంప్ర‌దించాల‌ని చెప్పారు. వారితో చాలా సేపు మాట్లాడారు కూడా! దీంతో ఈ ప‌రిణామం వైసీపీ బాస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఇబ్బందిక‌రంగా మారింది. రాజ‌ధాని రైతు పేరు చెబితే అంతెత్తున ఊగిపోయే జ‌గ‌న్ కు త‌న సొంత పార్టీ ఎమ్మెల్యే ఇలా చేయ‌డం ఏ మాత్రం న‌చ్చ‌ని ప‌రిణామ‌మే! అయితే కోటంరెడ్డి చూపిన ప‌రిణితి మాత్రం ప‌లువురి ప్ర‌శంస‌లు అందుకుంటోంది. అంద‌రి వైసీపీ నాయ‌కుల మాదిరిగా రాజ‌ధాని రైతుల‌ను పెయిడ్ ఆర్టిస్టులు అంటూ దూష‌ణ చేయ‌కుండా, చాలా హుందాగా న‌డుచుకున్న తీరు ఆనాడు  స్వ‌ప‌క్షంలో విప‌క్షం అన్న విధంగా వ్య‌వ‌హ‌రించిన పీజేఆర్ ను గుర్తు చేస్తోంద‌ని కొంద‌రి వాద‌న కూడా! ముందు నుంచి కూడా పార్టీ విధేయుడిగా అనేక ఉద్య‌మాల్లో పాల్గొన్న వాడి గా మంచి గుర్తింపు ఉన్న కోటంరెడ్డి,.. ప్ర‌జాస్వామ్య పంథాలో సాగుతున్న ఉద్య‌మానికి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం మంచి ప‌రిణామ‌మే! స‌హ‌జంగానే త‌న సొంత ఊరికి వ‌చ్చిన వారిని అతిథులుగా భావించి క‌ల‌వ‌డం అన్న‌ది  ఏ త‌ప్పూ కాదు. అయితే దీనిని చిలువ‌లు ప‌లువలు చేసి రాయ‌డం అన్న‌దే పెద్ద త‌ల‌నొప్పి.

మరింత సమాచారం తెలుసుకోండి: