6నెలల నుంచి ఐదేళ్ల లోపు చిన్నారులకు కోవిడ్ టీకా అత్యవసర వినియోగానికి అమెరికా ఔషధ సంస్థ ఫైజర్.. ఎఫ్ డీఏకు దరఖాస్తు చేసుకుంది. దీనికి అనుమతి లభిస్తే చిన్నారులకు అందుబాటులోకి వచ్చిన తొలి టీకాగా ఫైజర్ నిలవనుంది. అమెరికాలో కరోనాతో ఆస్పత్రుల్లో చేరుతున్న చిన్నారుల సంఖ్య పెరిగిందని ఫైజర్ తెలిపింది. భవిష్యత్ వేరియంట్లను ఎదుర్కోవడంతో పాటు పిల్లలను కాపాడుకునేందుకు ఎఫ్ డీఏతో కలిసి పనిచేస్తామని పేర్కొంది.

గత 50రోజుల్లో అమెరికాలో లక్ష మంది కరోనాతో మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 9లక్షలు దాటిందని జాన్స్ హాప్కిన్స్ వర్సిటీ పేర్కొంది.,మరణాలపై అధ్యక్షుడు బైడెన్ విచారం వ్యక్తం చేశారు. అమెరికన్లంతా బూస్టర్ డోసులు వేయించుకోవాలని పిలుపునిచ్చారు. కరోనా మిగిల్చిన నష్టం మానసికంగా.. శారీరకంగా భారమైనదన్నారు. అమెరికా తర్వాత బ్రెజిల్ లో 6లక్షలు, భారత్ లో 5లక్షల మరణాలు నమోదయ్యాయి.

కరోనా టీకా 2డోసులు తీసుకున్న వారికి విమాన టికెట్లపై పదిశాతం డిస్కౌంట్ ఇస్తున్నట్టు ఇండిగో ప్రకటించింది. వాక్సి ఫేర్ పేరుతో ఆఫర్ ను సోషల్ మీడియాలో వెల్లడించింది. ప్రయాణీకులు టికెట్ బుక్ చేసుకునే సమయానికి భారత్ లో ఉంటేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇండిగో వెబ్ సైట్ లోనే బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకున్న 15రోజుల తర్వాత ఈ డిస్కౌంట్ పొందొచ్చు. ఎయిర్ పోర్ట్ చెక్ ఇన్ కౌంటర్ లో టీకా సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుంది.

కరోనాతో అనాథలైన వారిని.. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారిని పెద్ద మనసుతో ఆదుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇందుకోసం సీఎం ఆఫీసులో డిప్యూటీ సెక్రటరీ స్థాయి అధికారిని నోడల్ ఆఫీసర్ గా నియమించాలని తెలిపింది. అర్హులైన బాధితులంతా పరిహారం కోసం దరఖాస్తు చేసుకునేలా చూడాలని సూచించింది. వారంలోగా సమీక్షించి పరిహారం అందజేయాలంది. లేదంటే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది.





మరింత సమాచారం తెలుసుకోండి: