వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఒడిశా తీరానికి ఆనుకొని కొనసాగుతోంది. రానున్న 48గంటల్లో ఇది బలపడే అవకాశం కనిపిస్తుండగా.. మత్స్యకారులు బుధవారం వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, అనకాపల్లి, విశాఖ, తూ.గో, కోనసీమ, కాకినాడ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కోస్తా జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలనీ.. ముందస్తుగా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరుగకుండా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశించారు.

ఇక ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కు వరద ఉధృతి కొనసాగుతోంది. బ్యారేజ్ కు ప్రస్తుతం 48వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. 55గేట్లను ఒక అడుగుమేర ఎత్తి, ఔట్ ఫ్లో 43వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణానది, ప్రకాశం బ్యారేజ్ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఫలితంగా విలీన మండలాల్లో 25గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బుట్టాయిగూడెం ఏజెన్సీలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. అటు కూనవరం దగ్గర గోదావరి నీటిమట్టం 47అడుగులకు చేరింది. కోనసీమలోని లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

మొత్తానికి తెలుగు రాష్ట్రాలను వర్షాలు వెంటాడుతున్నాయి. ప్రజలు ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశాలున్నాయి. కాబట్టి వీలైనంత వరకు ఇళ్లు దాటి బయటకు రాకుండా చూసుకోవాలి. రోడ్లపైకి వచ్చేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే మ్యాన్ హోళ్లు తెరుచుకొని ఉంటాయి. ప్రమాదం పొంచి ఉంటుంది.






మరింత సమాచారం తెలుసుకోండి: