ఏపీలో స్థానిక ఎన్నికలు వచ్చేశాయి. అధికార పార్టీ వైసీపీ మంచి దూకుడుగా ఉంది. ప్రతిపక్షం టీడీపీ చేతులెత్తేసినట్టే కనిపిస్తోంది. ఇక ఏపీలో ఈ ఎన్నికలు అయిపోతే.. మళ్లీ నాలుగేళ్ల వరకూ పెద్దగా ఏ ఎన్నికలూ లేవు. అందుకే స్థానిక ఎన్నికలను క్లీన్ స్వీప్ చేసి అధికారం మరింత సుస్థిరం చేసుకోవాలని జగన్ భావిస్తున్నారు. అయితే ఇలాంటి దూకుడు సమయంలో ఆయన తీసుకున్న ఓ నిర్ణయం సంచలనంగా మారింది.

 

 

గుంటూరు జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిలిపివేశారు. నరసరావుపేట, బాపట్ల, పొన్నూరు, మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీలకు ఎన్నికలు జరపొద్దని పురపాలక శాఖ ఉన్నతాధికారుల ద్వారా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అమరావతి మెట్రోపాలిటన్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు పేరుతో రాజధాని గ్రామాల్లో ఎన్నికలు నిలిపివేయాలని పంచాయతీరాజ్‌ శాఖ కూడా కోరింది. వీటికి ఎస్‌ఈసీ కూడా ఆమోదం తెలపింది.

 

 

దీంతో గుంటూరులో ఐదు పురపాలక సంఘాల్లో ఎన్నికలు నిర్వహించడం లేదు. ఇప్పటి వరకూ నిస్తేజంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి ఈ జగన్ నిర్ణయం ఓ ఆయుధంగా మారే అవకాశం ఉంది. రాజధాని ఉద్యమంపై భయంతోనే జగన్ ఇప్పుడు ఎన్నికలు జరిపించడం లేదనే ప్రచారాన్ని ఎక్కువ చేసే అవకాశం ఉంది. అసెంబ్లీలో మూడు రాజధానులపై సీఎం జగన్‌ ప్రకటన చేసిన మరుసటి రోజు ఈ ప్రాంతంలో జనం నిరసనలు తెలుపుతున్నారు.

 

 

ఇప్పుడు ఓటమి భయంతోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని జేఏసీగా ఏర్పడిన తెలుగుదేశం, సీపీఐ, జనసేన, దళిత సంఘాలు ఆరోపిస్తాయి. ఎన్నికల ముందు జగన్ రాజధాని విషయంలో తప్పు చేశారు..అందుకే భయపడుతున్నారని ప్రచారం చేసే అవకాశం ఉంది. అయితే ఈ ప్రాంతాల్లో ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలే అవకాశం వల్లే జగన్ ఇక్కడ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారా.. లేక ఇంకేమైనా రాజకీయ కారణాలు ఉన్నాయా అన్నది అంతుబట్టకుండా ఉంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: