అమెరికాలో న్యూయార్క్‌లాగా మన దేశంలో ముంబై తయారవుతుందేమోననే భయం ఇప్పుడు వెంటాడుతోంది. రోజూ వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు ఇక్కడ బయటపడుతున్నాయి. పదుల సంఖ్యలో చనిపోతున్నారు. మరో వారం రోజులపాటు ఈ నెంబర్ మరింత పెరిగే ప్రమాదముందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఒకవేళ ఆ తర్వాత కూడా తగ్గకపోతే సిచ్యుయేషన్ కంట్రోల్‌ దాటే ప్రమాదం కనిపిస్తోంది.

 

ముంబైలో పరిస్తితి రోజురోజుకూ దారుణంగా మారుతోంది. కొన్ని రోజులుగా ఇక్కడ రోజూ వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. పదుల సంఖ్యలో మరణాలు ఉంటున్నాయి. దీంతో భారీ ప్రణాళికతో ముంబై కార్పొరేషన్‌ సిద్ధమైంది. తాత్కాలికంగా క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. స్కూళ్లు, స్టేడియాలు, పెద్ద భవంతులను ఇందుకోసం ఎంచుకుంది. స్థానిక నేషనల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో 8 వేల మందికి క్వారంటైన్ కల్పించాలని నిర్ణయించింది. 

 

ముంబైని కరోనా నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వం అన్ని మార్గాలనూ అన్వేషిస్తోంది. జనసాంద్రత అధికంగా ఉండే మురికివాడల నుంచి ప్రజలను వీలైనంత త్వరగా తరలించాలని భావిస్తోంది. ముఖ్యంగా మురికివాడల్లో అనారోగ్యంగా ఉన్నవారిని మొదట తాత్కాలిక క్వారంటైన్‌లో ఉంచాలని నిర్ణయించింది. ప్రాధమికంగా చాలా మందిలో వ్యాధి లక్షణాలు కనిపించడం లేదు. తక్కువ మోతాదులో వ్యాధి లక్షణాలు కనిపించిన వారందరినీ ఇక్కడికి తరలిస్తున్నారు.

 

ముంబై ఆసుపత్రులు కూడా హాట్‌స్పాట్స్‌గా మారాయి. దీంతో వైద్య సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. స్థానిక వోక్‌హార్ట్ ఆసుపత్రిలో సుమారు వంద మందికి కరోనా సోకింది. జస్లోక్ అనే ఆసుపత్రిలో కూడా ఒక నర్సుకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆ తర్వాత ఇక్కడ మరో 21 మంది కరోనా బారిన పడినట్లు గుర్తించారు. దక్షిణ ముంబైలోని భాటియా హాస్పిటల్, ఖార్‌లోని హిందూజా ఆసుపత్రిలో కూడా ఇదే సిచ్యుయేషన్ ఉంది. ఆసుపత్రుల్లో ఇలాంటి పరిస్థితి ప్రమాదకరంగా భావించిన ప్రభుత్వం కరోనా కోసం ప్రత్యేకంగా ఆసుపత్రులను తీర్చిదిద్దాలనుకుంటోంది. లోక్‌నాయక్, జీబీ పంత్, రాజీవ్‌గాంధీ స్పెషాలిటీ ఆసుపత్రులను కరోనా కోసం ప్రత్యేకంగా కేటాయించింది. 

 

మరోవైపు ఆసుపత్రులో వైద్య పరికరాల కొరత ఉంది. దీంతో వైద్య సిబ్బంది ఆందోళనకు దిగారు. రక్షణ పరికరాలు లేకుండా వైద్యం నిర్వహించలేమని చేతులెత్తేశారు. వారికి సరిపడా పరికరాలను అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే అవి ఏమాత్రం సరిపోవడం లేదు. ప్రభుత్వం మాత్రం ఈ విషయాన్ని ఒప్పుకోవట్లేదు. సరిపడా రక్షణ పరికరాలు అందుబాటులో ఉండడంతో పాటు వెయ్యి వరకూ రిజర్వ్‌లో ఉన్నాయని స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లింది ప్రభుత్వం. 

 

ముంబై నగరంలో పరీక్షలు కూడా నెమ్మదిగా సాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యాధి లక్షణాలతో ఇబ్బంది పడుతున్నవారికి కూడా పరీక్షలు నిర్వహించలేకపోతోందని తెలుస్తోంది. సరిపడా టెస్టింగ్‌ కిట్స్‌ లేకపోవడమే ఇందుకు కారణం. అయితే పరీక్షలు వేగవంతం చేయడంతో పాటు ఎక్కువ మందికి చేయడం ద్వారా మరిన్ని కేసులు బయటపడతాయని అంచనా. ధారావిలోని 7 లక్షల మందికి పరీక్షలు చేయాలంటే లక్షల్లో కిట్స్ అవసరమవుతాయి. వేలల్లో కిట్స్‌ దొరకడమే కష్టంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్ని కిట్స్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం ఎలా సమకూర్చుకుంటుందనేది ఆసక్తి కలిగిస్తోంది.

 

రాబోయే రెండు మూడు వారాలు ముంబై భవితవ్యాన్ని నిర్ణయించబోతున్నాయి. ప్రస్తుత పరిస్థితిని బట్టి మరో వారం రోజులపాటు ప్రతి రోజూ వందల సంఖ్యలో కేసులు నమోదు కావడం ఖాయమని వైద్యవర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనికి వీలైనంత త్వరగా చెక్‌ పెట్టాలనుకుంటోంది ప్రభుత్వం. లేకుంటే ఇక్కడ కూడా న్యూయార్క్‌ లాంటి పరిస్థితి ఉత్పన్నమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. అయితే లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తుండడంతో వారం రోజుల తర్వాత కేసుల సంఖ్య తగ్గుముఖం పడ్తుందని భావిస్తున్నారు. 

 

సామాజిక వ్యాప్తి కాకుండా చూసుకోవడంపైనే మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దృష్టి పెట్టింది. ఔరాంగాబాద్‌లోని హైకోర్టు బెంచ్‌ కూడా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించింది. మరోవైపు ప్రజలు కూడా ప్రభుత్వ చర్యలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించింది. 

 

ముంబైలో వేలాది మంది చనిపోయారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో ఇలాంటి వార్తలను నమ్మొద్దని ముంబై పోలీసులు కోరారు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నవారిపై కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: