దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. అయితే కరోనా సోకి నయం అయిన వారికి మళ్లీ కరోనా సోకుతుందా..? అనే ప్రశ్నకు సమాధానంగా కొందరు సోకదు అని చెబుతుంటే మరికొందరు సోకుతుంది అని చెబుతున్నారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో కరోనా నుంచి కోలుకున్న ఒక వ్యక్తికి మరోసారి కరోనా సోకింది. 
 
ఒకే వ్యక్తికి రెండుసార్లు కరోనా సోకడంతో షాక్ అవ్వడం వైద్యుల వంతయింది. కరోనా బాధిత వ్యక్తి గత నెలలో ఢిల్లీలో జరిగిన తబ్లీగీ జమాత్ కార్యక్రమానికి హాజరయ్యాడు. అనంతరం కరోనా లక్షణాలు కనిపించడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందాడు. కొన్ని రోజుల తరువాత పరీక్షలు చేయగా నెగిటివ్ రావడంతో వైద్యులు యువకుడిని డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ అయిన వారం తరువాత యువకుడికి మరోసారి కరోనా లక్షణాలు కనిపించాయి. 
 
యువకుడు వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకున్నాడు. ఆ పరీక్షలలో యువకుడికి మరోసారి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో వైద్యులు యువకుడికి మరోసారి చికిత్స అందిస్తున్నారు. ఇలా కరోనా సోకిన వారికే మరలా సోకితే ఇప్పట్లో ఈ వైరస్ ను నియంత్రించటం అంత తేలిక కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య 15,000 దాటింది. 
 
దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలలో అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకూ 2000 మందికి పైగా కరోనా నుంచి కోలుకున్నారు. 500 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా కరోనా వైరస్ విజృంభిస్తోంది. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 809కు చేరగా ఏపీలోని 603 జిల్లాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో హైదరాబాద్ నగరంలో ఏపీలో కర్నూలు, గుంటూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: