ప్రధాని నరేంద్ర మోదీ అకస్మాత్తుగా లాక్ డౌన్ ప్రకటించడంతో ఏపీకి చెందిన చాలామంది ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. అయితే కేంద్రం మూడు రోజుల క్రితం లాక్ డౌన్ కు కొన్ని సడలింపులు ఇస్తూ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఏపీకి చెందిన వారు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోవడంతో ప్రభుత్వం వారిని రప్పించడానికి ప్రత్యేకంగా కొన్ని ఏర్పాట్లు చేసింది. 
 
ప్రభుత్వం దీనికి సంబంధించిన బాధ్యతలను ఐఏఎస్ కృష్ణబాబుకు అప్పగించింది. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న ఏపీకి చెందిన ప్రజలు స్పందన వెబ్ సైట్ https://www.spandana.ap.gov.in/ లో రిజిష్టర్ చేసుకోవాలని కృష్ణబాబు సూచించారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాల సీఎస్ లతో చర్చలు జరిపామని... రాష్ట్రానికి రావాలనుకునే వారి కోసం ఏర్పాట్లు చేయాలని కోరామన్నారు. ఇప్పటికే స్పందన వెబ్ సైట్ ద్వారా రాజస్థాన్ లో దాదాపు 9,000 మంది రిజిష్టర్ చేసుకున్నారని తెలిపారు. 
 
ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారిని ఏపీకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. తమిళనాడు రాష్ట్రంలో చిక్కుకున్న మత్స్యకారులను రాష్ట్రానికి తీసుకొస్తున్నట్టు ప్రకటన చేశారు. మహారాష్ట్ర వలస కూలీలను ఆ రాష్ట్రానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని.... శ్రామిక్ రైళ్లలో వలస కూలీలకు మాత్రమే అనుమతులు ఇస్తున్నామని సాధారణ ప్రజలకు అనుమతి ఉండదని అన్నారు. 
 
10,500 మంది ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని... తెలంగాణ నుంచి ఏపీకి వచ్చేవారికి అనుమతులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా రాష్ట్ర సరిహద్దుల్లోకి వచ్చిన వారిని అనుమతించే ప్రసక్తి లేదని పేర్కొన్నారు. వలస కూలీల కొరకు రాష్ట్రంలో ప్రత్యేక క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన చేశారు. ఆన్ లైన్ లో రిజిష్టర్ చేసుకోవడం సాధ్యం కాని వారు తహశీల్దార్ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల  ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: