దేశంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతిరోజూ పదుల సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏపీలో నిన్న 33 కొత్త కేసులు నమోదు కాగా తెలంగాణలో 51 కొత్త కేసులు నమోదయ్యాయి. ఏపీలో కేసుల సంఖ్య 2051కు చేరగా తెలంగాణలో 1326 కేసులు నమోదయ్యాయి. 
 
రాష్ట్రంలో ఒకవైపు కరోనా విజృంభిస్తుంటే ఏపీ ప్రజలు కొత్త సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. లాక్ డౌన్ వల్ల ఆదాయం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దినసరి కూలీలు, పేదలు పనులు లేక ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్ డౌన్ వల్ల దేశంలోని అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. దీంతో ఏపీ ట్రాన్స్‌కో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ బిల్లుల చెల్లింపు విషయంలో ప్రజలకు శుభవార్త చెప్పారు. 
 
విద్యుత్ బిల్లుల చెల్లింపులకు 45 రోజుల గడువును ఇస్తున్నట్టు కీలక ప్రకటన చేశారు. సాధారణంగా నిబంధనల ప్రకారం బిల్లు జారీ అయిన 15 రోజుల్లోపు నగదు చెల్లించాల్సి ఉంటుంది. కానీ లాక్ డౌన్ వల్ల ప్రజలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో వినియోగదారులు జూన్ 15వ తేదీలోపు బిల్లు చెల్లించాలని విద్యుత్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. జూన్ 15వ తేదీలోపు కరెంట్ బిల్లులు చెల్లించిన వారికి ఎటువంటి జరిమానా విధించమని ప్రకటన చేసింది. 
 
 
కరెంట్ బిల్లుల గురించి ఏవైనా సందేహాలు ఉంటే 1912 నంబర్ కు కాల్ చేయాలని అధికారులు సూచించారు. కాగా కరెంట్ బిల్లులు భారీగా వచ్చాయని వినియోగదారులు ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు జగన్ సర్కార్ రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తూనే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటోంది. గత నెలలో సున్నా వడ్డీ డబ్బులను విడుదల చేసిన జగన్ సర్కార్ ఈ నెలలో రైతు భరోసా నగదును రైతుల ఖాతాలలో జమ చేయనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: