ఏపీ సీఎం గా వైఎస్ జగన్ ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. ఆయన పాలనలో తండ్రి మార్కు సంక్షేమాన్ని అమలు చేస్తున్నారు. ఆ విషయం ఆయన ముందే చెప్పారు కాబట్టి ఈ విషయంలో జగన్ ను తప్పుబట్టలేం. తన మేనిఫెస్టో ప్రకటించిన తీరుగానే ఆయన ముందుకెళ్తున్నాడు. అయితే ఈ క్రమంలో పాలనలో అనేక తప్పుటడుగులూ పడుతున్నాయి.

 

 

అధికారంలోకి రాగానే జగన్ ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లను మూసేయించారు. అది టీడీపీ పథకం అయినా పేద ప్రజలకు తిండి పెట్టేదే. పోనీ దాన్ని రాజన్న క్యాంటీన్లుగా మారుస్తామని చెప్పినా ఇంత వరకూ అమలు కాలేదు. అలా పేదోడి నోటి దగ్గర ముద్ద పోయింది. అధికారంలోకి రాగానే కొత్త ఇసుక పాలసీ పై నిర్ణయం తీసుకోకుండానే పాత ఇసుక పాలసీని రద్దు చేశారు. దీంతో ఇసుక కొరత ఎక్కువై నిర్మాణ రంగం ఇబ్బందులు పడింది.

 

 

151 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయన్న కారణమో ఏమో కానీ జగన్ చాలా విషయాల్లో దూకుడుగా ముందుకు వెళ్లి దెబ్బ తిన్నారు. ఇలాంటి అంశాలు ఆయన ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చాయి. వాటిలో రాజధాని మార్పు అంశం ఒకటి. రాజధాని మార్పు నిర్ణయాన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదు. కానీ అందుకు ఆయన రాజ్యాంగబద్దమైన పద్దతులు అవలంభించకపోవడమే సమస్యగా మారింది.

 

 

శాసనమండలి రాజధాని బిల్లును ఆమోదించలేదని ఏకంగా దాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అది కేంద్రం చేతిలో ఉన్న నిర్ణయమే అయినా దూకుడుగా తీసుకున్నారు. ఇప్పటి వరకూ దాన్ని రద్దు చేయలేకపోయారు. అసలు మండలిని కొనసాగించి ఉంటే.. ఈ పాటికి రాజధాని బిల్లుకు ఆమోదం కూడా వచ్చి ఉండేదేమో. అంతే కాదు.. ముందు ముందు మండలిలో వైసీపీకే ఎక్కువ ప్రాతినిధ్యం దక్కేది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: