కోవిడ్ బాధితుల హోం ఐసోలేషన్ నిబంధనలపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. వృద్ధులు, చిన్నారులు ఐసోలేషన్ పై డాక్టర్లు నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. దీర్ఘకాలిక రోగాలు ఉంటే.. హోం ఐసోలేషన్ వద్దని సూచించింది. 

 

దేశంలో కరోనా విస్తరిస్తున్న తరుణంలో.. హోం ఐసోలేషన్ నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. హెచ్ఐవీ, క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక రోగులు హోం ఐసోలేషన్ లో ఉండొద్దని సూచించింది. వృద్ధులు, చిన్నపిల్లల్ని ఐసోలేషన్ చేయడానికి డాక్టర్ల అనుమతి తీసుకోవాలని కేంద్రం  స్పష్టం చేసింది. 

 

వరుసగా మూడు రోజుల పాటు జ్వరం లేని బాధితుల్ని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ చేయొచ్చని తెలిపింది. అయితే హోం ఐసోలేషన్ లో ఉండాలని తేల్చిచెప్పింది. హోం ఐసోలేషన్  లో ఉన్న బాధితులు ఇంట్లో ఇతర కుటుంబసభ్యులతో కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. హోం ఐసోలేషన్ లో ఉన్న వారికి 24 గంటల పాటు సంరక్షకులు అందుబాటులో ఉండాలని ప్రభుత్వం కోరింది. హోం ఐసోలేషన్ లో ఉన్న  బాధితులు, సంరక్షకులు వారితో సన్నిహితంగా మెలిగినవారు. హైడ్రాక్సిక్లోరోక్విన్ మందులను ఉపయోగించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది.

 

లివర్, గుండె సమస్యలు, డయాబెటిక్, బీపీ ఉన్నవారంతా వైద్యులు పరీక్షలు చేసిన తర్వాతే.. హోం ఐసోలేషన్ లో ఉండాలని పేర్కొంది. ఆరోగ్య సేతు యాప్ ద్వారా హోం ఐసోలేషన్ లో ఉన్న బాధితులు ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలని,  స్థానికంగా ఉన్న వైద్యాధికారికి  సమాచారం ఇవ్వాలని చెప్పింది కేంద్రం. 

 

దేశంలో కరోనా కేసులు ఆరు లక్షలు దాటగా.. కేసుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటికే ముంబై, ఢిల్లీ లాంటి నగరాల్లో బెడ్లకు కొరత ఏర్పడిన తరుణంలో.. హోం ఐసోలేషన్ నిబంధనల్లో మార్పులు చేసింది కేంద్రం. హోం ఐసోలేషన్లో ఉంటున్నవారు నిబంధనలు పాటించడం లేలదని ఫిర్యాదులు రావడంతో.. కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనాను అందరూ సీరియస్ గా తీసుకోవాలని, వ్యాక్సిన్ వచ్చేవరకూ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: