ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పంజా విసురుతోంది. తాజాగా 2 వేల 593 కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో ఇంత వరకూ కరోనా బారిన పడ్డ వాళ్ల సంఖ్య 38 వేలు దాటింది. మరోవైపు కరోనా కట్టడి చర్యల్లో భాగంగా భారీగా పరీక్షలు చేస్తోంది ప్రభుత్వం. 

 

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతికి అడ్డూ-అదుపూ లేకుండా పోతోంది. అంతకంతకూ  పెరుగుతున్న కరోనా కొత్త కేసులు... మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఒక్క రోజే 2 వేల 593 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 38 వేల 44కి చేరింది. అదే విధంగా కరోనాతో ఒక్క రోజే 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కరోనా మృతుల సంఖ్య 492కి చేరింది.

  

కరోనా కేసుల్లో కర్నూలు, తూర్పు గోదావరి జిల్లాలు ముందంజలో ఉన్నాయి. కర్నూలు జిల్లాలో 590 కేసులు నమోదు కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 500 మంది కరోనా బారిన పడ్డారు. చిత్తూరు జిల్లాలో 205, పశ్చి గోదావరిలో 195, అనంతపురం 174, గుంటూరులో 139, కృష్ణాలో 132, కడప, నెల్లూరు జిల్లాల్లో చెరో 126, శ్రీకుకుళంలో 111, విజయనగరంలో 101, విశాఖ జిల్లాలో 81 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

 

కరోనా మరణాల విషయానికొస్తే... తూర్పు గోదావరి, ప్రకాశం జిల్లాల్లో 8 చొప్పున కరోనా మరణాలు నమోదయ్యాయి. చిత్తూరులో 5, కడపలో 4, అనంతపురం, గుంటూరు, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో ముగ్గురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. 

 

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా 18 వేల 159 మంది వివిధ ఆస్పత్రులు, క్వారంటైన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు. మరో 19 వేల 393 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు తెలిపారు అధికారులు.  

 

కరోనాను కట్టడి చేసేందుకు పెద్ద ఎత్తున నిర్ధారణ పరీక్షలు చేస్తోంది ఏపీ సర్కార్‌. దీనిలో భాగంగా గడిచిన 24 గంటల్లో 22 వేల 304 మంది నమూనాలను పరీక్షించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 12 లక్షల 40 వేల మందికి కరోనా పరీక్షలు జరిగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: