హైదరాబాద్ హై రిస్క్ లో పడింది. నగరంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నగరాల్లో.. హైదరాబాద్ రెండో స్థానానికి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా 44 వేల పాజిటివ్ కేసులుంటే... ఒక్క హైదరాబాద్ పరిధిలోనే 39 వేల కేసులుండటం ఆందోళన కలిగిస్తోంది. హాట్ స్పాట్ లుగా గుర్తించిన ప్రాంతాల్లో హైదరాబాద్ రెండో స్థానంలో ఉండటం కలవరపెడుతోంది.
భాగ్యనగరంలో కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. మొదట్లో కొన్ని ఏరియాలకే పరిమితమైన కరోనా వ్యాప్తి... ఇప్పుడు వీధివీధికీ పాకింది. నిత్యం వందల కేసులు, పదుల సంఖ్యలో మరణాలతో... నగరవాసికి కునుకులేకుండా చేస్తోంది కరోనా. దేశవ్యాప్తంగా ఉన్న హాట్‌స్పాట్ కేంద్రాల్లో హైదరాబాద్ కూడా చేరింది. 50 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో.. వైరస్ వ్యాప్తికి సంబంధించి బెంగుళూరు మొదటి స్థానంలో ఉండగా... హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది.
ముంబై, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్ నగరాల్లో కరోనా దూకుడు కాస్త తగ్గగా.. ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరుల్లో వైరస్ వ్యాప్తి తీవ్రం అవుతోంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో టెస్టులు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం జులై 19 నాటికి రెండున్నర లక్షలకుపైగా పరీక్షలు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 44 వేల పాజిటివ్ కేసులు నమోదవగా.. ఒక్క హైదరాబాద్ లోనే 39 వేల కేసులు నమోదయ్యాయి. ఈ గణాంకాలతోనే.. హైదరాబాద్ ఎంతటి రిస్క్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
దేశంలో కొత్త కరోనా హాట్‌స్పాట్స్‌గా బెంగళూరు, హైదరాబాద్, పుణెలు నిలిచాయి. తొమ్మిది అర్బన్ సెంటర్స్, 5 మిలియన్‌కు పైగా జనాభా కలిగిన ఈ నగరాల్లో కరోనా కేసుల సంఖ్య ఉధృతంగా పెరుగుతోంది. ఇంతకు ముందు ఈ లిస్ట్‌లో ఉన్న ముంబై, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్‌లలో వైరస్ ప్రభావం కాస్త తగ్గడం ఊరట కలిగించే అంశం. హయ్యస్ట్ కరోనా ఇన్ఫెక్షన్స్ రేట్ ఉన్న సిటీగా బెంగళూరు ఉంది.
హైదరాబాద్ లో... మిలియన్‌కు 2వేల 61 కేసులు నమోదవుతున్నాయి. అలాగే మిలియన్‌కు 36 మంది చనిపోతున్నారు. భాగ్యనగరంలో కేసుల శాతం 7.8గా ఉంది. బెంగళూరు, హైదరాబాద్ తర్వాత కరోనా వ్యాప్తి ఎక్కువగా పుణె, సూరత్, కోల్‌కతా. ఢిల్లీ, చెన్నై. ముంబై, అహ్మదాబాద్‌లో ఉంది.
ఆరంభంలో కరోనా టెస్టులను పెద్దగా పట్టించుకోని తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు పరీక్షల మీద ఫోకస్ పెట్టింది. ఇప్పటికే రెండున్నర లక్షల ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టు కిట్లను తెప్పించిన ప్రభుత్వం.. మరో 5 లక్షల యాంటీజెన్ టెస్టులను చేయాలని భావిస్తోంది. దక్షిణ కొరియా సంస్థకు ఇప్పటికే ఆర్డర్ పెట్టగా.. అవి వచ్చే సమయాన్ని బట్టి టెస్టుల సంఖ్యను పెంచనున్నట్లు ప్రకటించింది. నీతి ఆయోగ్ వెల్లడించిన వివరాల ప్రకారం అత్యధిక టెస్టులు చేసిన రాష్ట్రాల జాబితాలో ఏపీ రెండో స్థానంలో ఉండగా.. తక్కువ టెస్టులు చేసిన రాష్ట్రాల జాబితాలో బీహార్ తర్వాతి స్థానంలో తెలంగాణ నిలిచింది. ఇది కూడా కలవరపెడుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి