భారీ వర్షాలతో అతలాకుతలమైన హైదరాబాద్‌లో పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తోంది ప్రభుత్వం. వరదలతో ఇబ్బందిపడ్డ వారికి ఆర్ధిక సాయం అందించాలని నిర్ణయించారు సీఎం కేసీఆర్‌. పూర్తిగా ఇల్లు కూలిపోయిన వారికి లక్ష రూపాయలు, పాక్షికంగా దెబ్బతిన్న వారికి 50 వేల రూపాయల చొప్పున అందిస్తామన్నారు. నేటి నుంచే ఈ ఆర్ధిక సహాయం పంపిణీ ప్రారంభమైంది.  

కుండ‌పోత వ‌ర్షాలు, భారీ వ‌ర‌ద‌ల‌తో అల్లాడుతున్న  హైద‌రాబాద్ ప్రజ‌ల‌కు ఆర్ధిక సహాయం ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. పేద‌ల‌కు సాయం అందించ‌డం కోసం మున్సిప‌ల్ శాఖ‌కు ప్రభుత్వం రూ. 550 కోట్లు విడుద‌ల చేసింది. వ‌ర‌ద నీటి ప్రభావానికి గురైన హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప్రతి ఇంటికి రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల వ‌ల్ల ఇల్లు పూర్తిగా కూలిపోయిన వారికి రూ. ల‌క్ష చొప్పున, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు.  

నగరంలో 200-250 బృందాలను ఏర్పాటు చేసి, అన్ని చోట్లా ఆర్థిక సాయం అందించే కార్యక్రమం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్ నగర పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాల కలెక్టర్లు, వారి బృందాలు వెంటనే రంగంలోకి దిగి ఆర్థిక సాయం అందించే కార్యక్రమం చేపట్టాలని సీఎం ఇప్పటికే ఆదేశించారు. ఇందులో హైదరాబాద్ నగరానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పోరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ అంతా భాగస్వాములు అవుతున్నారు. నష్టపోయిన ప్రజలు లక్షల మందికైనా సరే, సాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని సీఎం కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు.

భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల వ‌ల్ల న‌ష్టపోయిన హైద‌రాబాద్ ప్రజ‌ల‌ను ఆదుకోవ‌డానికి పారిశ్రామిక‌వేత్తలు, వ్యాపార ప్రముఖులు ముందుకు రావాల‌ని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. క‌ష్టాల్లో ఉన్న ప్రజ‌ల‌ను ఆదుకోవ‌డానికి ఉదార‌త చూపాలన్నారు. మొత్తానికి వరదల్లో నష్టపోయిన ప్రజలకు వరద సాయం అందుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: