మల్టీనేషనల్‌ కంపెనీలకు.. ఐటీ దిగ్గజ ఆఫీసులకు కేరాఫ్‌ అడ్రస్.. శేరిలింగంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్. ఆకాశాన్ని తాకే అంతస్తులు, అపార్ట్‌మెంట్లు.. మల్టీప్లెక్స్‌లు, మాల్స్‌.. స్టోర్స్‌..! కళ్లు తిరిగే భవనాలెన్నో ఇక్కడ కనిపిస్తాయి.  అధునాతన హంగులతో అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్లు, కేబుల్‌ బ్రిడ్జ్‌... ఇవే అభివృద్ధి అనుకుంటే పొరపాటు. వీటి చాటునే కనీస అవసరాలు లేని కాలనీలు.. అభివృద్ధికి నోచుకోని బస్తీలు బోలెడు. ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌లో.. గ్రేటర్‌ రాజకీయాలు చాలా ఆసక్తిని రేపుతున్నాయి.

శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం.. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా చెప్పొచ్చు. ఇక్కడ గజం జాగాకు లక్షలు పెట్టాల్సిందే. ఫ్లాట్లు విల్లాలు కొనాలంటే కోట్లు గుమ్మరించాల్సిందే. ఈ నియోజకవర్గం పరిధిలో ఏడు గ్రేటర్ డివిజన్లు ఉన్నాయి. శేర్‌లింగంపల్లి, గచ్చిబౌలి, కొండాపూర్‌, మాదాపూర్‌, మియాపూర్‌, హఫీజ్‌పేట్‌, చందానగర్‌.. ఈ ఏడు డివిజన్లు.. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోకి వస్తాయి. వినడానికి ఇవన్నీ బాగా అభివృద్ధి చెందిన డివిజన్లలా అనిపించినా.. ఇక్కడా సమస్యలెన్నో..  అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న ఏరియాలు చాలానే ఉన్నాయి.


ముందుగా గచ్చిబౌలి డివిజన్ తీసుకుంటే, క్లాసు, మాసు కలగలిసి ఉండే డివిజన్ ఇది. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీకి కేరాఫ్ అడ్రస్. అదే సమయంలో మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతం. ఇదే డివిజన్‌లో వెలుగు కింద చీకటిలా కొన్ని బస్తీలున్నాయి. గచ్చీబౌలి డివిజన్ విస్తీర్ణంలో పెద్దదైనప్పటికీ ఇక్కడ 42 వేల మంది ఓటర్లే ఉన్నారు. నివాస ప్రాంతాలకంటే సాఫ్ట్‌వేర్ కంపెనీలు..  కమర్షియల్ సిటీగా పేరుంది.
అద్దాల మేడల వెనకే అభివృద్ధికి నోచుకోని బస్తీలు గచ్చిబౌలి డివిజన్‌లో ఉన్నాయి. ఎలాంటి మౌలిక వసతులు లేని ఎన్టీఆర్‌ నగర్‌తోపాటు అస్తవ్యస్తమైన రోడ్లు, పొంగిపొర్లుతున్న డ్రైనేజీలున్న ఏరియాల్లో ఖాజాగూడ, నానక్‌రాంగూడ ఉన్నాయి. ఓ పక్క హైటెక్ ఏరియా.. మరోపక్క మురికివాడల కలయికగా ఉంటుంది శేరిలింగంపల్లి డివిజన్. ఇక్కడ 62 వేల  మంది ఓటర్లున్నారు. చూద్దాం.. ఈ ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో..!





మరింత సమాచారం తెలుసుకోండి: