
ఆఫ్రికా దేశం లిబియా రాజధాని ట్రిపోలిలో విలాసవంతమైన హోటల్‌పై ఉగ్రవాదులు భయంకరమైన దాడి చేసారు. ఈ ఘటనలో ఎనిమిదిమంది మరణించారు. మృతుల్లో ముగ్గురు గార్డులు ఉండగా మిగిలిన ఐదుగురు విదేశీయులు. ప్రభుత్వం, దౌత్యవర్గాల కార్యకలాపాలు, సమావేశాలు ఎక్కువగా జరిగే కోరింథియా హోటల్‌పై ఈ దాడి జరిగింది. మధ్యధరా సముద్రం తీరంలో ఈ హోటల్ ఉంది. ఒక్కసారిగా దాడికి పాల్పడిన ఉగ్రవాదులు హోటల్ రిసెప్షన్లో కాల్పులకు తెగబడ్డారు. హోటల్ వెలుపల కారు బాంబు పేలుడు జరిగింది. మరికొంతమంది ఉగ్రవాదులు ఇంకా హోటల్ లోపల ఉన్నట్లు సమాచారం హోటల్ సిబ్బంది లేదా ఇతరులు ఎవరైనా లోపల ఉన్నదీ లేనిదీ స్పష్టంకాలేదు. గాయపడినవారిలో ఫిలిప్పీన్ జాతీయుడు ఉన్నాడు. ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)కి చెందిన ట్విట్టర్లో ఈ హోటల్‌పై దాడికి పాల్పడింది ఈ ఉగ్రవాద సంస్థేననే సమాచారం ఉంది. దీనిని ఇంకా ధృవీకరించలేదు.
ఆకస్మికంగా కాల్పుల శబ్ధం వినిపించిందని, ఒక్కసారిగా అందరూ పరిగెత్తుతూ కనిపించారు, భూగర్భ గ్యారేజీ ద్వారా తామంతా హోటల్ వెనక నుండి తప్పించుకున్నాం అని ప్రత్యక్షసాక్షి ఒకరు మీడియాకు తెలిపారు. ఎంతమంది ఉగ్రవాదులు దాడి చేసిందీ తెలియరాలేదు. ముగ్గురు నుండి ఐదుగురు ఉండవచ్చునని విభిన్నవర్గాల కథనం. దాడి చేసినవారిలో ఒకరిద్దరు ఆత్మాహుతి దాడికి ప్రయత్నించి నట్లు సమాచారం. ఒక ఉగ్రవాదిని పట్టుకున్నామని, మరో ఇద్దరు ఇంకా హోటల్ లోపల ఉన్నారని భద్రతా వర్గాలు తెలిపాయి. పేలుడు నేపథ్యంలో హోటల్ ప్రాంతంలో భద్రతా బలగాలు పెద్దఎత్తున మోహరించాయి. పరిసర ప్రాంతాలన్నింటినీ కట్టుదిట్టం చేసారు. అనేక విదేశీ కంపెనీలు తాత్కాలిక కార్యాలయాలు నిర్వహిస్తున్న ఈ హోటల్ దాడి జరిగిన సమయంలో దాదాపు ఖాళీగా ఉన్నట్లు హోటల్ సిబ్బందిలో ఒకరు తెలిపారు. ఈ భవనాన్ని ఖాళీ చేయాలంటూ కొన్నిరోజుల క్రితమే మేనేజర్లకు హెచ్చరికలు వచ్చినట్లు హోటల్ భద్రతా వర్గాలు తెలిపాయి.
.
.