వ్యాక్సినేషన్ పై ప్రజల్లో ఉన్న భయాలు పోగొట్టేందుకు గతంలో చాలా ప్రయత్నాలు చేసింది, చేస్తోంది ప్రభుత్వం. అయితే తొలి దశలో ఎవరూ వ్యాక్సినేషన్ ని పెద్దగా పట్టించుకోలేదు. సెకండ్ వేవ్ దెబ్బతో అందరూ టీకా కేంద్రాలకు క్యూలు కడుతున్నారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వ్యాక్సిన్ అంటే భయమో, అపనమ్మకమో ఉన్నవారు కూడా ఉన్నారు. వారందర్నీ చైతన్యం చేసేందుకు తన పరిధిలో ఓ వినూత్న ప్రయత్నం చేశారు తమిళనాడుకి చెందిన ఆర్టిస్ట్ గౌతమ్.

ఇది టీకా ఆటో. అంటే ఈ ఆటోలో వచ్చి ఎవరూ టీకా వేయరు. కేవలం టీకా గురించిన ప్రచారం మాత్రమే జరుగుతుంది. ఆ ప్రచారం కూడా ఆటో డిజైన్ లాగానే వెరైటీగా ఉంటుంది. గౌతమ్ తయారు చేసిన టీకా ఆటో ఇప్పుడు సెన్సేషన్ గా మారింది. సోషల్ మీడియా అంతా దీనిపైనే ఫోకస్ పెట్టింది. ఈ వెరైటీ ఐడియాతో వ్యాక్సినేషన్ కి ఫుల్ పబ్లిసిటీ పెంచాడు ఆర్టిస్ట్ గౌతమ్. ప్రస్తుతం చెన్నై వీధుల్లో ఈ ఆటో దౌడు తీస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారంతో మిగతా ప్రాంతాల్లో కూడా ఇలాంటి వినూత్న ప్రయోగాలు చేయాలనుకుంటున్నారు ఔత్సాహికులు.



ఆటో ముందు, వెనక టీకాలను పోలిన సిరంజి లను డిజైన్ చేసి అంటించారు. ఆటో పైభాగాన ఇంజెక్షన్ సీసా నమూనా ఉంచారు. కరోనా టీకా తీసుకోడానికి చాలామంది వెనకడుగేస్తున్నారని, భయపడుతున్నారని, వారందరికీ అవగాహన కల్పించేందుకే ఈ ప్రయత్నం అంటున్నారు గౌతమ్. ఈ ఆటోను అందరూ విచిత్రంగా చూస్తున్నారని, తన ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇస్తోందని చెబుతున్నారాయన.

గౌతమ్ చేసిన ప్రయత్నాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. వ్యాక్సినేషన్ పై ప్రభుత్వం చేపడుతున్న ప్రచారంతోపాటు, స్వచ్ఛందంగా ఇలా కొంతమందైనా ముందుకొస్తే టీకాలపై ఉన్న అపోహలు తొలగిపోతాయి. కళాకారులు తమ పరిధిలో తాము చేయగలిగిన ప్రచారం చేస్తే.. వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతం అవుతుంది. దేశానికి కరోనా కష్టాలు తొలగిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: