హైటెక్ సిటీ.. హైదరాబాద్‌లోని మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల తలరాతను మార్చేసింది. హైటెక్ సిటీ రాకముందు... ఈ మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాలు నగరానికి దూరంగా.. చిట్టడవులను తలపిస్తూ ఉండేవి.. ఆ తర్వాత హెటెక్ సిటీ ఏర్పాటుతో ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు హైదరాబాద్‌లోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా మారింది. ఇప్పుడు అలాంటి మరో హైటెక్‌ సిటీ మరోచోట రూపుదిద్దుకోబోతోంది.


తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ శివార్లలలో మరో ఐటీ హబ్‌ ఏర్పాటు చేయాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌ లో ఐటీ, అనుబంధ సంస్థలకు గిరాకీ పెరగుతున్నందున హైదరాబాద్‌ పరిసరాల్లో ఐటీ హబ్‌ సిద్ధం చేసేందుకు ప్లాన్ రెడీ చేసింది. మరి ఈ కొత్త హైటెక్ సిటీ ఎక్కడ వస్తుందో తెలుసా.. ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు అత్యంత సమీపంలో ఉన్న కొల్లూరు, ఇదుళ్లనాగులపల్లి పరిసర ప్రాంతాల్లో రాబోతోంది. ఇక్కడే ఎందుకంటే.. ఇది ఔటర్ రింగ్ రోడ్డుకు అత్యంత సమీపంలోనే ఉంది.


మరో అనుకూల అంశం ఏంటంటే.. ఇక్కడా దాదాపు 700 ఎకరాల వరకూ ప్రభుత్వ, సీలింగ్‌, మిగులు , ఎసైన్డ్‌ భూములు ఉన్నాయి. ఇప్పటికే హెచ్‌ఎండీఏ 640 ఎకరాలు గుర్తించింది. వీటిలో అధిక శాతం  ఖాళీగానే ఉన్నాయి. అంతే కాదు.. ఇలా గుర్తించిన ప్రభుత్వ  భూమంతా దాదాపు పక్కపక్కనే ఉంది. ఈ భూమిని డెవలప్ చేయడం సులభం. దీంతో ప్రభుత్వానికి పెద్దగా ఖర్చు లేకుండానే భూసేకరణ సమస్య తీరిపోతుంది.

ఈ కొత్త ఐటీ జోన్ కోసం భూ సమీకరణ విధానం అవలభించనున్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరు, ఇదుళ్లనాగులపల్లి గ్రామాలతో పాటు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం కొండకల్‌ గ్రామ పరిధిలో ఈ కొత్త ఐటీ జోన్‌ ఏర్పాటు చేయబోతున్నారు. హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీ తరహాలోనే ఇక్కడూ కూడా ఐటీ, ఐటీఈఎస్‌ సంస్థలను ఏర్పాటు చేస్తారట. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళిక రెడీ అయ్యిందట. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తే ఇక కొల్లూరు మరో హైటెక్ సిటీ అవుతుందంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: