ఏపీలో అధికార వైసీపీలో అసంతృప్తి జ్వాలలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. మరో రెండు మూడు నెలల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన కేబినెట్‌ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తారన్న వార్తలు అధికార పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. పార్టీ గెలిచిన తొలి ఏడాదిలో ఎవరు కూడా నోరు విప్పేందుకు సాహసం చేయలేదు. అయితే రెండో ఏడాది నుంచి రెబల్ ఎంపి రఘురామకృష్ణరాజుతో మొదలైన అసంతృప్తి జ్వాలలు క్రమక్రమంగా రాష్ట్రంలోని 13 జిల్లాలకు విస్తరించాయి. ఇప్పుడు అన్ని జిల్లాల్లోనూ కీలక నేతల మధ్య ఎంత మాత్రం సఖ్యత లేదు. సీనియర్ నేతలు అయిన‌ ఆనం రామనారాయణ రెడ్డి - గడికోట శ్రీకాంత్ రెడ్డి  - కోరుముట్ల శ్రీనివాసులు - మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల ఏమాత్రం సంతృప్తిగా లేరని తెలుస్తోంది.

ఇక ఎంపీలు అయితే తమకు ప్రయారిటీ లేదని తాము డ‌మ్మీలం అయిపోయానని నిర్వేదంతో ఉన్నారట. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి - నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి - హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ - అనంతపురం ఎంపీ తలారి రంగయ్య తమను స్థానిక ఎమ్మెల్యేలు , మంత్రులు ఏమాత్రం గౌరవించడం లేదని ఆవేదనతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలాఉంటే మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. సాధారణంగా వివాదాస్పద రాజకీయాలకు దూరంగా ఉండే మాగుంట ఇప్పుడు బాలినేని తో ఢీ అంటే ఢీ అనే రేంజ్ లో వ్యవహరిస్తున్నారు. ఆయన తన వ్యాపార అవసరాల నేపథ్యంలో లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలతో టచ్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది.

ఇటు జిల్లాలో తన వర్గాన్ని రాజకీయంగా అణగదొక్కేందుకు ప్రయత్నాలు జ‌రుగుతుండ‌టం... అటు జగన్ పట్టించుకోకపోవడంతో మాగుంట సైతం తీవ్ర అసంతృప్తి తో వున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తో ఢిల్లీలో రహస్యంగా సమావేశమయ్యారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ నేతలు ఎవరు రఘురామకృష్ణరాజు ను కలవకూడదని పార్టీ అధిష్టానం కండిషన్ పెట్టింది. ముఖ్యంగా ఎంపీలు రఘురామ కు ఎలాంటి లీకులు ఇవ్వకూడదని జగన్ చెప్పారు. అయినా మాగుంట మాత్రం రఘురామను కలవడంతో పార్టీలో కలకలం రేపుతోంది. రేపటి వేళ‌ మాగుంట తన అసంతృప్తిని బ్లాస్ట్ చేస్తారని పార్టీ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: