గుంటూరు జిల్లా వైసీపీలో కుర్చీలాట జోరుగా సాగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు ఒక సీటుకు ఇద్ద‌రి నుంచి ముగ్గురు కుస్తీప‌డుతున్నారు. ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల మాట ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. కీల‌క‌మైన ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం తాడికొండ‌లో ఇద్ద‌రు నేత‌లు పోటీ ప‌డుతూ.. రాజ‌కీయాల‌ను హీటెక్కిస్తున్నారు. ఒక‌రు వివాదాల జోలికి వెళ్ల‌కుండా.. త‌నకు ప్ర‌జ‌ల్లో మంచిమార్కులు ప‌డేలా చేసుకుంటుంటే.. మ‌రొక‌రు నిత్యం వివాదాల‌తో రాజ‌కీయంగా హీటెక్కిస్తున్నారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ రాజ‌కీయాలు హీటెక్కాయ‌నే కామెంట్లు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

విష‌యం ఏంటంటే.. తాడికొండ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో  డాక్ట‌ర్ ఉండ‌వ‌ల్లి శ్రీదేవి .. వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. వృత్తి రీత్యాడాక్ట‌ర్ కావ‌డం.. సొంత ఆసుప‌త్రి కూడా ఉండ‌డంతో ఆమె వారానికి నాలుగు రోజులు హైద‌రాబాద్‌లోనే ఉంటున్నారు. అసెంబ్లీ ఉన్న‌ప్పుడుమాత్రం పూర్తిగా నియోజ‌క‌వ‌ర్గంలో ఉంటున్నారు. ఇక‌, ఇటీవ‌ల టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద్‌.. ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాడికొండ నుంచి పోటీ చేయాల‌ని ఆయన భావిస్తున్నారు.

వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల్లోనే ఆయ‌న టీడీపీ త‌ర‌పున ఇక్క‌డ నుంచి పోటీ చేయాల‌ని అనుకున్నా.. సాధ్యం కాలేదు. ఇక‌, ఈ ప‌రిణామాల‌తోనే ఆయ‌న పార్టీకి గుడ్ బై చెప్పార‌ని అంటారు. వ‌చ్చే ఎన్నిక‌ల గురించి ఇప్ప‌టి నుంచి ప్లాన్ చేసుకుంటున్నారు.  ఈ క్ర‌మంలో పార్టీలో యాక్టివ్‌గా ఉండ‌డంతోపాటు.. నియోజ క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే లేని స‌మ‌యం చూసుకుని ప‌ర్య‌టిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కే ఈ టికెట్ ద‌క్కుతుంద‌ని.. త‌న‌ను గెలిపించేందుకు కృషి చేయాల‌ని ఇక్క‌డి వారికి ఆయ‌న పిలుపునిస్తున్నారు.

అయితే.. ఈ ప‌రిణామంపై ఆగ్రహంతో ఉన్న ఉండ‌వ‌ల్లి.. జ‌గ‌న్ త‌న‌ను త‌ప్ప ఇక్క‌డ ఎవ‌రినీ నిల‌బెట్ట‌ర‌ని.. కార్య‌క‌ర్త‌ల‌కు ఫోన్లు చేసి చెబుతున్నారు. మ‌రోవైపు.. త‌న పాత నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో త‌న‌కు ఉన్న ప‌లుకుబ‌డిని ఉప‌యోగిస్తున్న డొక్కా.. అంద‌రినీ క‌లుపుకొనిపోయేందుకు కృషి చేస్తున్నారు. దీంతో ఇక్క‌డ ఒక సీటు ఇద్ద‌రు నేత‌లు అనే మాట వినిపిస్తోంది. అయితే.. పార్టీ అధిస్టానం మాత్రం ఈ ప‌రిణామాల‌ను నిశితంగా గ‌మ‌నిస్తోంది. ఎన్నిక‌ల నాటికి ఎవ‌రికి పాజిటివ్ మార్కులు ఉంటే.. వారికి ఇచ్చే అవ‌కాశం ఉంటుంద‌నే సంకేతాలు పంపుతోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: