దేశంలో బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలతో ఫ్రంట్ ఏర్పాటుకు టీఆర్ఎస్ అధ్య‌క్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ మ‌రోసారి ప్రయత్నాలు ప్రారంభించారు. లెఫ్ట్ పార్టీలతో పాటు ఇతర పార్టీలతో కేసీఆర్ సంప్రదింపులు మొద‌లుపెట్టారు. త్వరలోనే దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న‌ ఈ తరుణంలో కేసీఆర్ బీజేపీ వ్య‌తిరే పార్టీలతో వరుస భేటీలు నిర్వహించడం చర్చకు దారితీస్తోంది. గత వారం లో సిపిఐ, సిపిఎం జాతీయ నేతలతో సీఎం కేసీఆర్ భేటీ అయిన విష‌యం తెలిసిందే. 


పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు  వచ్చిన సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తో కేసీఆర్ స‌మావేశం అయ్యారు. సిపిఎం నేతలు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. దేశ రాజకీయాలపై ఈ సమావేశంలో కెసీఆర్ క‌మ్యూనిస్టు పార్టీల నేతలతో చర్చ‌లు జ‌రిపారు.  ఈ భేటీ ముగిసిన నాలుగైదు రోజుల అనంత‌రం ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తో కూడా కెసిఆర్ భేటీ అయ్యారు. తేజస్వి తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ కూడా కేసీఆర్ తో ఫోన్లో మాట్లాడారు. గత ఏడాది తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది.


కొన్ని రోజుల త‌రువాత‌ వరి ధాన్యం అంశాన్ని టిఆర్ఎస్ తెరమీదికి తీసుకొచ్చింది. వరి ధాన్యం కొనుగోలుకు కేంద్రం సహకరించడం లేదని టిఆర్ఎస్ ప్ర‌భుత్వం ఆరోపిస్తోంది. పంట ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం లేదని కూడా కేసీఆర్ ప్రకటించారు. మరోవైపు వర్షాకాలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలులో టిఆర్ఎస్ గ‌వ‌ర్న‌మెంట్‌ సరైన చర్యలు తీసుకోలేదని బీజేపీ ఎదురుదాడికి దిగింది. ఈ విషయంపై కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు గాను మంత్రుల బృందం కూడా ఢిల్లీలో వారం రోజులుగా మ‌కా వేసింది. ఆ తర్వాత బీజేపీకి చెక్ పెట్టేందుకు కేసీఆర్ పార్టీలతో సమావేశాలు కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.


 రాష్ట్రాల హక్కులను కాలరాసేందుకు కేంద్రం వెనుకాడడం లేదని కూడా టిఆర్ఎస్ ఆరోపిస్తూ వ‌స్తోంది. కేంద్రం తీరుపై అసంతృప్తితో ఉన్న పార్టీలను కూడగట్టే పనిలో కేసీఆర్ ఉన్నారు. గత ఏడాదిలో తమిళనాడు పర్యటనకు వెళ్లిన సమయంలో తమిళనాడు సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు. కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అంతకుముందే తమిళనాడు సీఎం స్టాలిన్ తో పాటు  బీజేపీ వ్య‌తిరేక‌ పార్టీల‌కు సీఎం లేఖను రాశారు. ఆ లేఖలో ప్రతులను సీఎం కేసీఆర్ కు డీఎంకే ప్రతినిధుల బృందం అందించింది.


 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాల్లో భాగంగా.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేరళ సీఎం పిన‌ర‌య్‌తో  కేసీఆర్ చర్చ‌లు జ‌రిపారు. కానీ, 2019 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి ఏకపక్ష మెజారిటీతో విజయం సాధిండంతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు సాధ్యపడలేదు. ఇప్పుడు మరోసారి ఈ ప్రయత్నాలను కేసీఆర్ ప్రారంభించారు. అయితే, గ‌తంలో చంద్ర‌బాబు కూడా బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కి మద్దతుగా కూటమి కోసం ప్రయత్నించి ఘోరంగా దెబ్బ తిన్న విష‌యం తెలిసిందే. దీంతో ఇప్పుడు కేసీఆర్‌ ఏ మేరకు సక్సెస్ అవుతారో అన్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: