తెలంగాణా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. ఎప్పుడేమి మాట్లాడుతారో ఆయనకే తెలీదు.  రేవంత్ పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీ ఆఫీసు గాంధీభవన్లోకి అడుగు కూడా పెట్టనని భీషణ ప్రతిజ్ఞ చేశారు. తాజాగా గాంధీభవన్లో అదే రేవంత్ తో భేటీఅయ్యారు. తన ప్రతిజ్ఞ విషయాన్ని మీడియా ఎంపీకి గుర్తుచేస్తే తానెప్పుడూ గాంధీభవన్లోకి  అడుగుపెట్టనని చెప్పలేదన్నారు.

నిజానికి ఎంపీ గాంధీభవన్ మెట్లెక్కినా, మెట్లెక్కకపోయినా జనాలకు, మీడియాకు లాభనష్టాలేమీ లేవు. ఎంపీ వైఖరి వల్ల లాభనష్టాలు ఏవైనా ఉంటే అది కాంగ్రెస్ కు లేకపోతే ఆయనను నమ్ముకున్న మద్దతుదారులకు మాత్రమే. ఎంపీగా కోమటిరెడ్డి పనికిరాడని అనుకుంటే జనాలు వచ్చేఎన్నికల్లో చిత్తుగా ఓడగొడతారనటంలో సందేహంలేదు. నిన్నటివరకు రేవంత్-కోమటిరెడ్డి మధ్య సంబంధాలు ఉప్పు నిప్పులాగుండేవి. అయితే శుక్రవారం ఏమైందో ఏమో ఇద్దరు కూర్చుని మాట్లాడుకున్నారు. గాంధీభవన్ కు వచ్చిన ఎంపీ రేవంత్ ను ఎందుకు కలిశారన్నదే కీలకమైన ప్రశ్న.

తొందరలోనే జరగబోతున్న దళిత, గిరిజన ఆత్మగౌరవ సభల విషయమై ఇద్దరు మాట్లాడుకున్నారు. వచ్చేఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే విషయంలో అందరం కలిసికట్టుగా పనిచేస్తామని ఎంపీ చెప్పారు. పార్టీని బలోపేతం చేయటంకోసం అవసరమైతే తెలంగాణా వ్యాప్తంగా పాదయాత్ర చేయబోతున్నట్లు కూడా వెంకటరెడ్డి ప్రకటించారు. ఎంపీ చెప్పింది నమ్మేందుకు లేదు. ఎందుకంటే ఈరోజు చెప్పిన మాటమీద రేపు నిలబడరు. ఎప్పుడు ఎవరితో గొడవపడతారో చెప్పటం కష్టం.


రేవంత్ అంటే నిలువెత్తు వ్యతిరేకత నింపుకున్న కోమటిరెడ్డి ఎంతకాలం సఖ్యతగా ఉంటారో ఎవరు చెప్పలేరు. అందుకనే రేవంత్ మద్దతుదారులతో కూడా ఎంపీకి ఏమాత్రం పడదు. ఎలాగైనా రేవంత్ ను పీసీసీ ప్రెసిడెంట్ గా తప్పించాలని ఒకవైపు తీవ్రంగా కృషిచేస్తూనే మరోవైపు పార్టీ పటిష్టానికి కృషిచేస్తానని, పాదయాత్ర చేస్తానని చెప్పటం ఎంపీకి మాత్రమే చెల్లింది. కాకపోతే పార్టీ పటిష్టానికి కృషిచేస్తానన్నారు కానీ అది రేవంత్ తో కలిసా లేకపోతే విడిగానా అన్నదే సస్పెన్సు.


మరింత సమాచారం తెలుసుకోండి: