కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న సోషల్ మీడియా సడెన్ గా స్పీడందుకుంది. ఎన్నికలు దగ్గరకు వస్తుండటం కావచ్చు లేదా ఎక్కువమంది జనాలకు రీచ్ ఉండటం కూడా కారణంకావచ్చు. సోషల్ మీడియా వార్ ప్రధానంగా వైసీపీ-టీడీపీ మధ్యనే జరుగుతోంది. మధ్యలో తాను ఉన్నానని జనసేన సైనికులు గుర్తుచేస్తున్నా బరిలో ప్రధానంగా ఉన్నదైతే వైసీపీ, టీడీపీ మాత్రమే అనిచెప్పాలి. 2019 ఎన్నికలకు ముందు చాలా యాక్టివ్ గా ఉన్న వైసీపీ సోషల్ మీడియా విభాగం తర్వాత వివిధ కారణాలతో కామ్ అయిపోయింది.





ఇదే సమయంలో టీడీపీ తరపునుండి జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగాను, ప్రభుత్వంతో పాటు పార్టీపైన దాడులు ఎక్కువయ్యాయి. అయితే ఈమధ్యనే వైసీపీ నుండి ఒక్కసారిగా జోరుపెరిగింది. దాంతో చంద్రబాబునాయుడు, లోకేష్ తో పాటు ఎల్లోమీడియాలో వస్తున్న కథనాలు, వార్తలపై వెంటవెంటనే కౌంటర్లు, సెటైర్లతో వైసీపీ సోషల్ మీడియా రెచ్చిపోతోంది. తాజాగా కేంద్రం నుండి రాష్ట్రానికి రు. 10,461 కోట్లు వచ్చింది. దీన్ని జీర్ణించుకోలేని ఎల్లోమీడియా అడ్డదిడ్డంగా తప్పుడు రాతలు రాసింది.





జగన్ చేతకాని తనంవల్ల లక్షకోట్ల రూపాయలు రావాల్సుండగా పది వేల కోట్లతోనే ప్రభుత్వం సరిపెట్టుకున్నదని, భవిష్యత్తుకు ఉరంటు తప్పుడు కథనాలు అచ్చేసింది. దానికి మంత్రులు, ప్రభుత్వ స్ధాయి నుండి పెద్దగా కౌంటర్లు రాకపోయినా సోషల్ మీడియా విభాగం మాత్రం దుమ్ముదులిపేసింది. తమ కౌంటర్లకు మద్దతుగా మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు ఎల్లోమీడియాలో వచ్చిన వార్తను తప్పుపడుతు చేసిన కామెంట్లను జతచేసింది.






ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల దుష్ప్రచారంపై కౌంటర్లు,  వివేకానందరెడ్డి మర్డర్ కేసులో అవినాష్ పై వస్తున్న కథనాలను ఖండిస్తు ఇలా రకరకాలుగా సోషల్ మీడియా బాగా యాక్టివ్ అయిపోయింది. జగన్, ప్రభుత్వంపై టీడీపీ, జనసేన, ఎల్లోమీడియాలో వ్యతిరేకత వార్తలు, కథనాలు రావటం ఆలస్యం వైసీపీ సోషల్ మీడియా వెంటనే రెచ్చిపోతోంది. అబద్ధమేది ? వాస్తవం ఏది ? అంటు పోస్టులను షేర్ చేస్తోంది. ఇదే సమయంలో మంత్రులు, ఎంఎల్ఏల స్ధాయిలో జరుగుతున్న తప్పులపైన కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. మొత్తానికి ప్రత్యర్ధుల సోషల్ మీడియా వార్ కు  వైసీపీ సోషల్ మీడియా ధీటుగా బదులిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: