భార‌త్, పాకిస్తాన్ మ‌ధ్య కాల్పుల విర‌మ‌ణ అనంత‌రం నేటి మధ్యాహ్నం 12 గంట‌ల‌కు సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్స్ (డీజీఎంఓ) స్థాయిలో కీలక చర్చలు జరగాల్సి ఉంది. ఇదే స‌మ‌యంలో త్రివిధ దళాలతో మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వ‌హించ‌డంతో.. డీజీఎంఓ చ‌ర్చ‌లు సాయంత్రం 5 గంట‌ల‌కు వాయిదా ప‌డ్డాయి. హాట్‌లైన్ ద్వారా ఈ చర్చలు జరగబోతున్నాయి. సరిహద్దుల్లో కాల్పుల విరమణ, కొన‌సాగింపు, తదనంతర పరిస్థితి వంటి అంశాల‌పై ఇరు దేశాలు చ‌ర్చించుకోనున్నాయి.


అదే విధంగా డీజీఎంఓ చ‌ర్చ‌ల్లో భార‌త్‌, పాక్ దేశాలు త‌మ కీల‌క డిమాండ్లు ముందు పెట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. భార‌త్ పెట్ట‌నున్న డిమాండ్స్ లో మూడు ప్రధానంగా వినిపిస్తున్నాయి. పాక్‌లో త‌ల దాచుకుంటున్న‌ మసూద్ అజార్‌, హఫీజ్, దావూద్‌ ఇబ్రహీం వంటి టాప్ ఉగ్ర‌వాదుల‌ను త‌మ‌కు అప్పగించాల‌న్న‌ది భార‌త్ ప్ర‌ధాన డిమాండ్ గా తెలుస్తుంది. అలాగే పాకిస్థాన్‌ ఉగ్రవాదులకు సాయం నిలిపివేయాలి, పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్ ను అప్పగించాలనే డిమాండ్లను కూడా భారత్‌ చర్చల్లో ప్రతిపాదించనున్నట్లు స‌మాచారం.


పాక్ డిమాండ్ల విష‌యానికి వ‌స్తే.. పహ‌ల్గాం ఉగ్ర‌దాడి త‌ర్వాత భార‌త్ నిలిపివేసిన సింధూ జలాలను వెంటనే విడుదల చేయాల‌ని ప్ర‌తిపాదించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. అలాగే ఆపరేషన్ సిందూర్‌ను ఆపివేయాలి, త‌మ దేశ‌ పౌరులను చంపామని భారత్‌ ఒప్పుకోవాలనే డిమాండ్స్ తో పాక్ ముందుకు రాబోతున్న‌ట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా ఇరుదేశాల‌కు మ‌రిన్ని డిమాండ్స్ కూడా ఉండ‌నున్నాయి. కాగా,  కాగా, అమెరికా మధ్యవర్తిత్వంతో శనివారం భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ విష‌యాన్ని మొద‌ట డోనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌టించ‌గా.. ఆ త‌ర్వాత ఇరు దేశాల అధికారులు ధృవిక‌రించాయి. అయితే ఒప్పందం ముగిశాక పాక్ త‌న వ‌క్ర‌బుద్ధి చూపించింది. భారత సరిహద్దు రాష్ట్రాలపై డ్రోన్లు, క్షిపణులు, ఫైటర్ జెట్లతో దాడులు చేసింది. పాక్ బుద్ధి ముందే గ్ర‌హించిన భారత త్రివిధ దళాలు దాడుల‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. ఇక నేటి సాయంత్రం జ‌ర‌గ‌బోయే డీజీఎంఓ చ‌ర్చ‌ల అనంత‌రం ఇరుదేశాల మ‌ధ్య కాల్పుల విర‌మ‌ణ కొన‌సాగుతుందా? లేదా? అన్న విష‌యంపై పూర్తి స్ప‌ష్ట‌త రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: