
హైదరాబాదులోని హైదర్‌గూడలో జన్మించిన మాగంటి గోపీనాథ్.. ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో 1983లో తెలుగుదేశం పార్టీలో చేరి తన పొలిటికల్ కెరీర్ ప్రారంభించారు. 1985 నుంచి 1993 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగానే కాకుండా వివిధ హోదాల్లో పనిచేశారు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నుంచి జూబ్లీహిల్స్ శాసనసభకు తొలిసారి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో మాగంటి గోపీనాథ్ టీడీపీని వీడి 2018లో అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
అదే ఏడాది జరిగిన ముందస్తు ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడంతో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా రెండోసారి విజయం సాధించారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ మాగంటి సత్తా చాటారు. వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్ కొట్టారు. అయితే పాలిటిక్స్ లో సూపర్ సక్సెస్ అయిన మాగంటి గోపీనాథ్ కు సినిమాల్లో మాత్రం లక్ కలిసి రాలేదనే చెప్పాలి. 1995లో మాగంటి గోపీనాథ్ నిర్మాతగా `పాతబస్తీ` సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఉప్పలపాటి నారాయణరావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో సురేష్, శ్రీకాంత్, ఊహ ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది.
ఆ తర్వాత ఐదేళ్లు గ్యాప్ తీసుకున్న మాగంటి గోపీనాథ్.. 2000వ సంవత్సరంలో `రవన్న` మూవీని నిర్మించారు. ఇందులో రాజశేఖర్ హీరోగా నటిస్తే.. సౌందర్య హీరోయిన్. సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. అయితే రవన్న సినిమా కూడా ఫ్లాప్ అయింది. ఇక 2004లో `భద్రాది రాముడు`, 2009లో `నా స్టైలే వేరు` చిత్రాలను మాగంటి గోపీనాథ్ నిర్మించారు. ఈ సినిమాలు సైతం పరాజయం పాలయ్యాయి. ఆ దెబ్బతో మాగంటి గోపీనాథ్ సినిమాల వైపు చూడలేదు.