రాష్ట్ర రాజకీయాల్లో ఎమ్మెల్యేల పై విమర్శలు , ఆరోపణలు ఏ రోజు మినహాయింపుగా ఉండవు. కొందరు నేతలపై అవినీతి, అక్రమాల ఆరోపణలు తీవ్రంగా ఉండగా, మరికొందరిపై నేరుగా ఆరోపణలు లేకపోయినా ఇతర వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ ప్రచారంలో ఉంటారు. కానీ ఈ మధ్య ఒక “వైట్ పేపర్” జాబితా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అంటే .. వీరు వివాదాలకు దూరంగా ఉండే, నేరాల్లో పాల్పడని, ప్రమేయాలు లేకుండా ప్రజాసేవకే ప్రాధాన్యం ఇచ్చే ఎమ్మెల్యేల జాబితా.


ఈ జాబితాలో తొలుత పేరు వినిపించేది నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి (చిత్తూరు). వ్యవసాయంతో పాటు రెండు పరిశ్రమలు నిర్వహిస్తున్నప్పటికీ, ప్రభుత్వ అధికారాల్లో జోక్యం లేకుండా ఉండటం విశేషం. అయితే ప్రజలతో ప్రత్యక్షంగా మమేకం కావడంలో ఆయన కొంత వెనుకపడుతున్నారు అనే విమర్శలు ఉన్నాయి. ఆ తరువాతి పేరుగా గాలి భాను ప్రకాశ్ రెడ్డి (నగరి) వస్తారు. వివాదాలకు దూరంగా ఉండటంతో పాటు వారానికి కనీసం నాలుగు రోజులు ప్రజల మధ్యే గడుపుతూ వారి సమస్యలపై స్పందిస్తుంటారు. కానీ కూటమి నేతలతో మిశ్రమత ఎక్కువగా ఉండడం, బహిరంగ సభల ప్రసంగాల్లో మితిమీరి మాట్లాడడం ఒక మైనస్ పాయింట్‌గా ప్రచారంలో ఉంది.



గుంటూరు తూర్పు ఎమ్మెల్యేగా విజయాన్ని అందుకున్న టీడీపీ నేత కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ప్రజల మధ్యనే ఉండే ఆయన, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. కానీ పార్టీలో నిర్దిష్ట స్థాయికి చేరలేకపోవడం మైనస్ పాయింట్. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా ఈ జాబితాలో ఉన్నారు. వివాదాలకి దూరంగా ఉండే ఆయన, సంచలన వ్యాఖ్యలకు దూరంగా ఉంటారు. కానీ ప్రజల్లో ప్రత్యక్షంగా కనిపించకపోవడం కొంత నెగటివ్‌గా మారింది. అయితే పార్టీ కార్యకలాపాల్లో బిజీగా ఉండటంతో ఇది సహజంగా జరుగుతుందని అంటున్నారు. నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూడా ఈ జాబితాలో ప్రత్యేకస్థానం సంపాదించారు. నిరంతరం అందుబాటులో ఉండే ఈ మహిళా నేత, ఆడంబరాలకు దూరంగా ఉండే రాజకీయ నాయకురాలిగా మంచి పేరును తెచ్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: