ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన స్టైల్ మార్చి ప్రజల్లో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారని రాష్ట్రవ్యాప్తంగా చర్చ సాగుతోంది. గతంలో 2014-19 మధ్యకాలంలో కూడా ఆయన ప్రజల మధ్య తిరిగారు. కానీ ఆ సమయంలో భద్రతా కారణాలు, పాలనా ఒత్తిళ్లు ఉండటంతో ఎక్కడికి వెళ్లినా కేవలం పనులు చూసుకుని వెనుదిరిగేవారు. ప్రజలతో కేవలం ముచ్చట్ల వరకే పరిమితం అయ్యేవారు. అయితే, ఈసారి మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఇప్పటి చంద్రబాబు – కేవలం అధికారంలో ఉన్న సీఎం కాదు, ప్రజలతో కలిసిపోయే సీఎంగా మారిపోయారు. ఎక్కడికి వెళ్ళినా సాధారణ ప్రజలతో సమయాన్ని గడపడం, వారి పక్కన కూర్చుని మాట్లాడడం, కష్టసుఖాలు అడగడం ఆయన డైలీ రూటీన్‌గా మారింది.

ప్రతి నెలా 1వ తేదీకి జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని, లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి చేతుల్లో పింఛన్లు అందజేస్తూ టీ, కాఫీ తాగడం కూడా మొదలుపెట్టారు. దీంతో ప్రజలు ఆయనను “మన సీఎం” అని భావించే స్థాయికి చేరుకున్నారు. అంతేకాకుండా RTCలో ఉచిత ప్రయాణాన్ని ప్రకటించిన తర్వాత ఆయన మరింతగా మహిళలతో, ప్రయాణికులతో మమేకమవుతున్నారు. ఏ పనిమీద ఎక్కడికైనా వెళ్ళినా rtc బస్సులో ప్రయాణిస్తూ, ప్రయాణికులతో మాట్లాడుతూ వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పెట్టుబడులు, అభివృద్ధి పనులపై నేరుగా వారి మాటలు వింటున్నారు. ఇదే సమయంలో తన భవిష్యత్ విజన్‌ను వారికి వివరిస్తూ ప్రజల్లో మమేకమవుతున్నారు.

ఇటీవల విశాఖపట్నంలో డబుల్ డెక్కర్ బస్సులు ప్రారంభించిన తర్వాత ఆయన స్వయంగా ఆ బస్సులో ఎక్కి ప్రయాణికులతో కలిసి నాలుగు కిలోమీటర్లు ప్రయాణించారు. విశాఖను ఆర్థిక రాజధానిగా మార్చే తన ప్రణాళికలను వారితో చర్చించారు. వారివద్ద నుంచి అభిప్రాయాలు సేకరించారు. అదే విధంగా కుప్పంలో పర్యటించినప్పుడు కూడా స్థానిక rtc బస్సులో ఎక్కి రైతులు, మహిళలతో కలిసి కుప్పం బ్రాంచ్ కెనాల్ వరకు ప్రయాణించారు. మార్గమధ్యంలో ప్రజల సమస్యలు నేరుగా విని వెంటనే అధికారులను ఆదేశించారు. మొత్తానికి, ఈసారి చంద్రబాబు పూర్తిగా ప్రజా సీఎంగా, మనం అన్నట్టుగా మన మధ్య ఉన్న సీఎంగా ముద్ర వేసుకోవడానికి అడుగులు వేస్తున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రజలతో ఇంత దగ్గరగా కలిసే చంద్రబాబు ఇమేజ్ టీడీపీకి పెద్ద ఎసెట్‌గా మారనుందని విశ్లేషకుల అంచనా.

మరింత సమాచారం తెలుసుకోండి: