ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజన, సరిహద్దుల మార్పు, పేర్ల మార్పు వంటి అంశాలు మళ్లీ చర్చకు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో ఒక మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జిల్లాల సమస్యలను సమీక్షించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇప్పటివరకు ఆ కమిటీ ఎలాంటి కార్యాచరణను ప్రారంభించకపోవడం రాజకీయ వర్గాల్లో ప్రశ్నార్ధకంగా మారింది. మరోవైపు కేంద్ర గణాంక శాఖ ఇప్పటికే రాష్ట్రాలకు గడువును విధించింది. డిసెంబర్ 31 నాటికి ఉన్న సరిహద్దులనే ఫైనల్‌గా పరిగణిస్తామని, ఆ తర్వాత కనీసం రెండేళ్లపాటు ఎలాంటి మార్పులు సాధ్యం కాదని స్పష్టంగా తెలిపింది. అంటే జిల్లాల సరిహద్దులు, మండలాల విభజన, పోలీస్ స్టేషన్ల పరిమితులు, జిల్లాల పేర్ల మార్పు లాంటి అంశాలు డిసెంబర్ 31 లోపు పూర్తి కావాలి.


లేకపోతే 2029 వరకు ఈ అంశం నిలిచిపోతుంది. ఎందుకంటే 2025 ఫిబ్రవరిలో కుల గణన, 2027లో జనాభా లెక్కలు జరగనున్నాయి. అవన్నీ పూర్తయే సరికి 2028-29 ఎన్నికల సమయం వస్తుంది. ఇంత ముఖ్యమైన డెడ్‌లైన్ ఉన్నా తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా జిల్లాల విభజనపై ఒక్క మాట చర్చ జరగకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సీఎం గాని, డిప్యూటీ సీఎం గాని, సంబంధిత మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు గాని ఈ అంశంపై స్పందించకపోవడం వల్ల ఈ ప్రక్రియను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టిందా అన్న అనుమానం కలుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల విభజనపై విభిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తుండగా, మరికొందరు ఉన్న జిల్లాల పేర్లను మార్చాలని కోరుతున్నారు.


అదే సమయంలో అదే జిల్లాల నుంచి కొందరు ఈ మార్పులకు వ్యతిరేకంగా వాదిస్తున్నారు. వీరంతా తమ తమ ప్రాంతాల్లో బలమైన నాయకులే కాకుండా, ప్రభావవంతమైన సామాజిక వర్గాలకు చెందినవారు కావడంతో ప్రభుత్వం ఎవరినీ విస్మరించలేని పరిస్థితిలో పడింది. మొత్తానికి, జిల్లాల పునర్విభజన అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అయినా, దానిపై ప్రభుత్వం, మంత్రివర్గ ఉప సంఘం మౌనంగా ఉండటం గమనార్హం. సమయం చాలా తక్కువగా ఉండటంతో ఇకపై ప్రభుత్వం తక్షణ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే కనీసం రెండు సంవత్సరాల పాటు జిల్లాల విభజన, పేర్ల మార్పు అంశాలు పూర్తిగా మరుగున పడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: