భారతదేశం అంటే ఏమిటి? యువ శక్తి, ఉత్సాహం, పటిష్టమైన భవిష్యత్తు! కానీ ఇప్పుడు ఓ పెద్ద డెమోగ్రాఫిక్ ట్విస్ట్ రాబోతోంది. “ఇండియా ఇన్ పిక్సల్స్” తాజా రిపోర్ట్ చెప్పిన షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే – దేశంలో మొత్తం జనాభాలో 27.1% మంది Gen Z (1997–2012లో జన్మించినవారు) ఉన్నా… దక్షిణాదిలో ఈ శాతం గణనీయంగా తక్కువ!


కారణాలు ఏమిటి?:
 దక్షిణ భారతదేశంలో యువత శాతం తగ్గడానికి ప్రధాన కారణం తగ్గిన జనన రేటు. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు కుటుంబ నియంత్రణలో ముందంజలో ఉన్నాయి. అక్షరాస్యత రేటు ఎక్కువగా ఉండటం, విద్యావంతులైన మహిళలు తక్కువ పిల్లలనే కోరుకోవడం వల్ల జనాభ తగ్గుదలకు కార‌ణం. ఆరోగ్య సేవలు మెరుగుపడటం, శిశు మరణాల రేటు తగ్గడం కూడా చిన్న కుటుంబాలకు దారితీసింది. ఆర్థిక, సామాజికంగా అభివృద్ధి చెందిన దక్షిణ రాష్ట్రాలు చిన్న కుటుంబాలను ప్రోత్సహించే జీవనశైలి అవలంబించాయి. ఇదే సమయంలో ఉత్తర భారతదేశంలోని బిహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో జనన రేటు ఇంకా ఎక్కువగానే ఉంది. అందువల్ల అక్కడ యువ జనాభా శాతం అధికంగా ఉంది.



భవిష్యత్తుపై ప్రభావం :
జనాభా అసమానతలు భవిష్యత్తులో దేశ రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలపై పెద్ద ఎత్తున ప్రభావం చూపనున్నాయి. రాజకీయంగా: జనాభా ఆధారంగా పార్లమెంట్ స్థానాల కేటాయింపులో మార్పులు రావచ్చు. దక్షిణాదిలో స్థానాలు తగ్గే అవకాశముండగా, ఉత్తర రాష్ట్రాల్లో పెరగవచ్చు. ఆర్థికంగా: ఉత్తర రాష్ట్రాల్లో యువత ఎక్కువగా ఉండటంతో శ్రామిక శక్తి బలంగా ఉంటుంది. ఇది అక్కడి పరిశ్రమలు, ఉద్యోగ మార్కెట్ పెరుగుదలకు దోహదం చేస్తుంది. సామాజికంగా: దక్షిణాదిలో వృద్ధుల జనాభా పెరిగే అవకాశం ఉంది. దీంతో ఆరోగ్య సంరక్షణ, వృద్ధాప్య భద్రతపై ప్రభుత్వాలు మరింత నిధులు ఖర్చు చేయాల్సి వస్తుంది.



Gen Z ప్రభావం :
 Gen Z కేవలం సంఖ్య మాత్రమే కాదు – వారు టెక్నాలజీతో పెరిగిన తరం, కొత్త ఆలోచనలతో ముందుకు సాగే శక్తి. ఉత్తర భారతదేశంలో Gen Z ఎక్కువగా ఉండటం, వారి సంస్కృతి, ప్రాధాన్యతలు, రాజకీయ ఆలోచనలు దేశవ్యాప్తంగా ఎక్కువ ప్రభావం చూపేలా చేస్తుంది. మరోవైపు దక్షిణాది రాష్ట్రాలు, నాణ్యమైన విద్య, ఆవిష్కరణలు, టెక్ ఆధారిత ఆర్థికతతో యువతను వినియోగించుకోవడానికి ముందుంటాయి. భారతదేశం భవిష్యత్తు Gen Z ఆకాంక్షలతోనే రూపుదిద్దుకోనుంది. ఉత్తరంలో సంఖ్య బలం ఉంటే, దక్షిణంలో నాణ్యతా బలం ఉంటుంది. ఈ రెండు దిశల్లోనూ సమన్వయం అవసరం. ప్రభుత్వాలు యువత శక్తిని సద్వినియోగం చేసుకునే విధానాలు, వృద్ధుల కోసం భద్రతా చర్యలు రెండింటినీ సమతుల్యం చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: