
జైలు నుంచి విడుదలైన వెంటనే వైఎస్ జగన్‌ను కలవడం తప్ప, ఆయన మళ్లీ ప్రజల మధ్య కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోనే ఉంటూ ఆరోగ్యపరీక్షలు చేయించుకుంటున్నారని సమాచారం. జైల్లో ఉన్న సమయంలో ఊపిరితిత్తుల సమస్య రావడంతో ఆయన ఇంకా పూర్తిగా కోలుకోలేదని సన్నిహితులు చెబుతున్నారు. వంశీ కుటుంబ సభ్యులు ఆయనకు ఇక రాజకీయాలకు దూరంగా ఉండాలని, వ్యాపారాలపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారని టాక్. రాజకీయాల వల్ల వచ్చిన ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని “వ్యాపారమే బెటర్” అనే అభిప్రాయంలో వంశీ కుటుంబ సభ్యులు ఉన్నారని తెలుస్తోంది. దీనితో వంశీ కూడా పునరాలోచనలో ఉన్నారని అంటున్నారు.
అయితే గన్నవరం నియోజకవర్గంలోని ముఖ్య కార్యకర్తలకు మాత్రం వంశీ టచ్‌లోనే ఉన్నారని చెబుతున్నారు. తరచూ ఫోన్‌లో మాట్లాడుతూ, పరిస్థితులు అనుకూలించగానే వస్తానని భరోసా ఇస్తున్నారట. ఆయన రాజకీయాలను వదిలేస్తారనే ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకున్నా, సన్నిహితులు మాత్రం “ఇంకాస్త సమయం ఇవ్వండి, తిరిగి వస్తారు” అని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద వల్లభనేని వంశీ భవిష్యత్తు గురించి స్పష్టత లేకపోవడంతో గన్నవరం రాజకీయాల్లో కొత్త పజిల్ ఏర్పడింది. నిజంగానే ఆయన రాజకీయాలకు గుడ్‌బై చెబుతారా? లేక ఆరోగ్యం కుదుటపడిన తర్వాత మరింత బలంగా తిరిగి వస్తారా? అన్నది చూడాలి. ఏదేమైనా, వంశీ నిర్ణయం గన్నవరం రాజకీయ సమీకరణాలపై పెద్ద ప్రభావం చూపించనుంది అనడంలో సందేహం లేదు.