ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుత పాలనలో గతం కంటే పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పిన చంద్రబాబు, తనను మించిన సీనియర్ నేత ఎవరు లేరని చెప్పుకునే స్థాయిలో ఉండేవారు. కానీ ఈసారి మాత్రం ఆయన స్టైల్ మార్చేశారు. ఇకపై బీజేపీకి దూరమయ్యే ఆలోచనలు లేవని, మోదీని, బీజేపీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారని పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. ఒకప్పుడు చంద్రబాబు – బీజేపీ పొత్తు పెట్టుకుని, మళ్లీ విడిపోవడం వెంటవెంటనే జరిగేది. కానీ ఇప్పుడు ఆయన తీరు పూర్తిగా మారిపోయింది. ఎప్పుడూ బెదిరింపులు, హెచ్చరికలు ఇచ్చే బాబు ఈసారి మాత్రం ఆ పద్ధతి వదిలేశారు. వీలుంటే మోదీపై కొన్ని మంచి మాటలు, బీజేపీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదే ఆయన వ్యూహంలో ప్రధానమైన మార్పు.


2019 ఎన్నికల్లో బీజేపీని వదిలేసి ఒంటరిగా పోటీ చేసినప్పుడు టీడీపీ ఎదుర్కొన్న పరిస్థితి ఇప్పటికీ ఆయనకు మరిచిపోలేదు. అదే కారణంగా నాలుగోసారి కూటమిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏ చిన్న రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు. బీజేపీతో పెట్టుకుంటే తాము నష్టపోతామని, వదులుకుంటే వెంటనే జగన్ దగ్గరవుతారని ఆయన స్పష్టంగా గ్రహించారు. అందుకే ఈసారి పొత్తు పటిష్టంగా కొనసాగించాలన్న సంకల్పంతో మోదీని మెచ్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీలో ఒత్తిడి చేయడం లేదు. బదులుగా రాష్ట్రానికి సాయం చేయమని బతిమాలుతున్నారు. “డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే అభివృద్ధి సాధ్యమవుతుంది” అని కూడా బీజేపీ నినాదం అందిపుచ్చుకున్నారు. ఇటీవల నెహ్రూ పై చేసిన విమర్శలు, మోదీని పొగిడిన సందర్భాలు చూస్తే ఆయనలో ఎంత మార్పు వచ్చిందో పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారు.



రాజకీయ విశ్లేషకులు చెబుతున్నట్లుగా, ఈసారి చంద్రబాబు బీజేపీతో తగవుల్లేకుండా, కేవలం పొగడ్తలతో అవసరమైన సాయం తెచ్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ మద్దతు అవసరమన్నా, ఆయన బెదిరింపులు పెట్టడం లేదు. తన రాజకీయ భవిష్యత్తు, రాష్ట్ర ప్రయోజనం రెండూ దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ వ్యూహం అమలు చేస్తున్నారని విశ్లేషకుల అభిప్రాయం. మొత్తానికి, చంద్రబాబు నాయుడు తన నాలుగో టర్మ్ లో పూర్తిగా కొత్త పంథా అవలంబించారు. ఒకప్పుడు ఢిల్లీలో సీనియర్ నేతగా ప్రభావం చూపిన బాబు, ఇప్పుడు మోదీని మెచ్చుకుంటూ, బీజేపీని పొగడ్తలతో ముందుకు నడిపిస్తున్నారు. ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుంది? నిజంగా రాష్ట్రానికి ప్రయోజనం కలిగిస్తుందా? అన్నది చూడాలి కానీ, ప్రస్తుతం చంద్రబాబు తీరే అందరి చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: