- చింతలపూడి వైసీపీ కన్వీనర్ కంభం విజయరాజు
- ( గోదావరి - ఇండియా హెరాల్డ్ )
మెడికల్ కాలేజ్‌లను పీపీపీ విధానంలో ప్రైవేటు పరం చేస్తూ పేదోడికి వైద్యం దూరం చేయడంతో పాటు పేదలకు వైద్య విద్యను దూరం చేస్తున్న చంద్రబాబుకు కోటి సంతకాల సేకరణతో సత్తా ఏంటో చూపించాలని చింతలపూడి నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ కంభం విజయరాజు అన్నారు. మీ ప్రతి ఒక్కరి సంతకం చంద్రబాబు గుండెల్లో గునపంలా దిగాలన్నారు. సోమవారం సాయంత్రం మండల కేంద్రంలోని పాత కొండగూడెంలో వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మండల వైసీపీ అధ్యక్షులు రాయంకుల సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయరాజు మాట్లాడుతూ యేడాదిన్నర కాలంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. యేడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అని చెప్పి ఇప్పటి వరకు ఒక్కటి మాత్రమే ఇచ్చారన్న విషయాన్ని కొందరు విజయరాజు దృష్టికి తీసుకువచ్చారు. అమ్మవడి కూడా కొందరికి మాత్రమే ఇచ్చారని.. అది కూడా జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై పోరాటం చేసి ఒత్తిడి చేస్తేనే ఇచ్చారని విజయరాజు అన్నారు. ఉచిత బస్సు అని చెప్పి కొత్త బస్సులు ఇవ్వలేదని.. ఒక్కో బస్సులో 100 - 150 మంది ప్రయాణం చేయాల్సిన దుస్థితి తీసుకువచ్చారని విమర్శించారు.
నిరుద్యోగ భృతి రు. 3 వేలు ఇస్తామని చెప్పడంతో ఎంతోమంది కూటమి ప్రభుత్వానికి ఓట్లేస్తే ఇప్పుడు నిలువునా మోసం చేశారని ఆయన మండిపడ్డారు. ఆడబిడ్డ నిధి అమలు చేయమంటే ఓ మంత్రి రాష్ట్రాన్ని అమ్ముకోవాలా ? అని ప్రశ్నిస్తున్నారని.. అలాంటప్పుడు ఎన్నికలకు ముందు మోసపు హామీలు ఎందుకు ఇచ్చారని విజయరాజు ప్రశ్నించారు. జగన్ పాలనలో వైద్యంతో పాటు నాడు నేడుతో ప్రభుత్వ విద్యను పటిష్టం చేస్తే.. నేడు చంద్రబాబు విద్య, వైద్య రంగాలను ప్రైవేటు పరం చేస్తూ నిర్వీర్యం చేస్తున్నారన్నారు. చంద్రబాబు నీళ్లల్లో మునిగిపోయే అమరావతిని కడుతూ కాలం గడిపేస్తున్నారని.. ఆయన ఎప్పుడూ సంపన్న, బూర్జువా వర్గాలకే న్యాయం చేస్తూ పేదోడికి పూర్తి వ్యతిరేకంగా వ్యవహరిస్తారని విమర్శించారు.
జగన్ పేదోడి ఇంటికి రేషన్ పంపిస్తే.. చంద్రబాబు ఈ పథకం కూడా రద్దు చేసి పేదలకు రేషన్ అందనీయడం లేదన్నారు. తమ్మిశెట్టి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పీపీపీ విధానంలో తన అనుయాయులకు కోట్లాది రూపాయల ప్రభుత్వ సంపద దోచిపెట్టేందుకు బాబు కుట్ర పన్నారన్నారు. కార్యక్రమంలో మండల వైసీపీ అధ్యక్షులు రాయంకుల సత్యనారాయణ, తమ్మిశెట్టి సుబ్రహ్మణ్యం, మెడంకి చిన్న, జోడాల వెంకట్, మండల వైసీపీ యూత్ విభాగం అధ్యక్షులు చింతనబోయిన సుబ్రహ్మణ్యం యాదవ్ ( సుబ్బు ), కొండగూడెం వైసీపీ అధ్యక్షులు చీకట్ల రమేష్, అంధుగుల జాన్, మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు సిరిశెట్టి సిద్ధిరాజు, మానుకొండ దేవరాజు, దేవసుతుడు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి