రాజధాని భూసేకరణ విషయంలో ఆంధ్రా సర్కారు వెనక్కుతగ్గింది. భూసమీకరణకు ముందుకురాని గ్రామాల్లో సేకరణ చట్టం ప్రయోగించాలని తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. భూసేకరణ చట్టం ప్రయోగించడం లేదని.. రైతులను ఒప్పించిన తర్వాతే భూములను తీసుకుంటామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. 

ఎంతో ఆలోచించి మరీ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు రాజధాని ప్రాంతంలో కలకలం సృష్టిస్తోంది. ఐతే.. ఈ నిర్ణయం తమ ప్రభావమేనని క్రెడిట్ చాటుకునేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇటీవల రాజధాని ప్రాంతంలో మొదట జనసేన అధ్యక్షడు పవన్ కల్యాణ్.. ఆ తర్వాత వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటించారు. పవన్ రాజధాని గ్రామాల్లో పర్యటిస్తే.. జగన్ విజయవాడ సీఆర్డీఏ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. 

మిత్రపక్షంగా ఉంటూనే ఉన్నా.. బానిసను కాదంటూ టీడీపీకి పవన్ ఇచ్చిన షాక్ తో మొదట టీడీపీ ఖంగుతింది. భూసేకరణకు దిగితే.. తప్పనిసరిగా ధర్నాకు దిగుతానని వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత జగన్ నిర్వహించిన ధర్నాకు కూడా మంచి స్పందన లభించింది. రాజధాని ఇష్యూ క్రమంగా సీరియస్ అవుతుండటంతో మొదటికే మోసం వస్తుందని ప్రభుత్వం పునరాలోచనలో పడింది. 

మిత్రపక్షంలో ఉండి కూడా తాను బానిసను కానంటూ పవన్ చేసిన ప్రకటనతోనే సర్కారు దిగివచ్చిందని పవన్ కల్యాణ్ అభిమానులు చెప్పుకుంటున్నారు. ఐతే.. పవన్ పర్యటన తర్వాత కూడా ప్రభుత్వ పెద్దలు భూసేకణరణకే మొగ్గు చూపారని.. వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. జగన్ ధర్నా తర్వాతనే సర్కారులో కదలిక వచ్చి ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ ఉప సంహరించుకుందని వైసీపీ నాయకులు చెబుతున్నారు. పవన్, జగన్ ఇద్దరి ప్రభావమూ 50-50 అంటున్నారు విశ్లేషకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: