గోదావరి జిల్లాలలో కాకినాడ రూరల్ నియోజకవర్గం పూర్తి ఆసక్తిగా మారింది. వైసీపీ నుంచి మాజీ జర్నలిస్టు, మాజీ మంత్రి కుర‌సాల‌ కన్నబాబు.. జనసేన నుంచి పంతం నానాజీ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓడిన నానాజీ ఐదేళ్లపాటు నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఉన్నారు. పైగా జనసేన నుంచి ఈసారి ఆయనే పోటీ చేస్తారన్న ప్రచారం బాగా జరిగింది. చివరకు ఆయనకే సీటు వచ్చింది. గత ఎన్నికల్లో ఓడిన ప్రజల్లో ఉండటం ఈసారి కూటమి బలంగా ఉండటం.. ఒక్కసారి అయినా పంతం నానాజీ గెలవాలి అనే జనాల సంఖ్య నియోజకవర్గంలో గట్టిగా ఉంది. ఈ నియోజకవర్గ నుంచి కన్నబాబు 2009లో ప్రజారాజ్యం నుంచి గెలిచి.. 2014లో ఓడిపోయారు.


ఆ ఎన్నికల్లో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసినా ఏకంగా 43 వేల ఓట్లు వచ్చాయి. 2019లో వైసీపీ నుంచి స్వల్ప మెజార్టీతో గెలిచి మంత్రి పదవి కూడా చేపట్టారు. ఎవరు వచ్చినా.. ఎవరు పిలిచినా పలుకుతారు.. అన్నది కన్నబాబుకు ఉన్న ప్లస్ పాయింట్. అయితే కూటమి ప్రభావం చాలా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలలో కాకినాడ పార్లమెంటు సీటు ఒక‌టి. ఇక్కడ వైసీపీ అభ్యర్థులు కూటమి బలాన్ని తట్టుకుని గెలవడం అంత ఈజీ కాదు. అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకు మీద కన్నబాబు నమ్మకంతో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో క్షత్రియులు వరకు ప్రస్తుతానికి కన్నబాబుకు అనుకూలంగా ఉన్నారు.


అయితే ఇక్కడ బలంగా ఉన్న శెట్టిబలిజ ఓటు బ్యాంకు.. టీడీపీ నుంచి జనసేన అభ్యర్థికి అనుకూలంగా మారుతుంది. కాపుల్లో కూడా మెజార్టీ ఓటర్లు.. ఇంకా చెప్పాలంటే 80% వరకు జనసేనకే ఓటు వేస్తారన్న ధీమా ఆ పార్టీకి ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పక్కనే ఉన్న పిఠాపురం నుంచి పోటీ చేయటం.. ఆయన సన్నిహితుడు టీ టైం ఉదయ్ కాకినాడ ఎంపీగా పోటీ చేస్తుండడంతో ఈ ప్రభావం కాకినాడ రూరల్ మీద చాలా గట్టిగా చూపిస్తోంది. ఇటు పంతం నానాజీకి కూడా వ్యక్తిగతంగా మంచి పేరు ఉంది.


ఇక నియోజకవర్గంలో భారీగా ఉన్న యువకులు ఈసారి కులాలకు అతీతంగా.. తమకే ఓటు వేస్తారని జనసేన భావిస్తోంది. క్షేత్రస్థాయిలో కార్యకర్తల్లో చూసుకుంటే.. జనసేన జనాల్లో ఉన్నంత గెలుపు ధీమా వైసీపీ జనాల్లో కనిపించడం లేదు. గెలిస్తే గెలుస్తాం ఇంకా టైం ఉందిగా అన్నట్టుగా చూస్తున్నారు. జనసేన వరకు ప్రధాన బలం అభ్యర్థి మీద ఉన్న సింపతి. ఇప్పటికే జనసేన కార్యకర్తల్లో గెలిచిపోయాం అన్న ధీమా అయితే వచ్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: