
చంద్రబాబునాయుడుకు బిజెపి బంపర్ ఆఫర్ ఇచ్చింది. రాష్ట్రప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా మాట్లాడుతూ అమరావతి రాజధాని ప్రాంతంలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ విషయంలో సిబిఐ విచారణను ఆహ్వానించాలని సూచించాడు. అలా సిబిఐ విచారణను ఆహ్వానించటం వల్ల ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి రెండు లాభాలుంటాయని కూడా రెడ్డి చెప్పాడు. మొదటిదేమో చంద్రబాబు స్వచ్చమైన నేతగా జనాలకు తెలుస్తుందట. ఇక రెండోదేమో కడిగిన ముత్యంలాగ అయిపోతాడట. నిజంగానే భూకుంభకోణంతో తనకు ఎటువంటి సంబంధం లేకపోతే తనంతట తానుగా సిబిఐ విచారణను ఆహ్వానించటానికి ఇబ్బందులు ఏమిటంటూ చంద్రబాబును సూటిగా ప్రశ్నించాడు.
బిజెపి నేత విష్ణు చేసిన సూచన చంద్రబాబుకు చాలా ఉపయోగకరమనే చెప్పాలి. రాష్ట్రాన్ని కుదుపేస్తున్న, దేశం దృష్టిని ఆకర్షిస్తున్న ఇన్ సైడర్ ట్రేడింగ్ కుంభకోణంలో చంద్రబాబు పాత్రపై ఇప్పటికే చాలా అనుమానాలు పెరిగిపోతున్నాయి. టిడిపి హయాంలో జరిగిన భూకుంభకోణంలో పదుల సంఖ్యలో చంద్రబాబు మద్దతుదారులు, సన్నిహితులు, పార్టీ నేతలు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ప్రభుత్వం ఆరోపిస్తోంది. రాజధాని ముసుగులో 4075 ఎకరాలను రైతుల నుండి కారుచవకగా చంద్రబాబు అండ్ కో కొట్టేసినట్లు చాలామంది అభియోగాలు ఎదుర్కొటున్నారు. వీరిలో అడ్వకేట్ జనరల్ గా పనిచేసిన దమ్మాలపాటి శ్రినివాస్ కూడా ఒకడు.
దమ్మాలపాటితో పాటు మరో 12 మంది మీద ఏసిబి ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ నమోదు చేసిందో వెంటనే హైకోర్టు విచారణకు బ్రేక్ వేస్తు స్టే ఇచ్చేసింది. స్టే ఇస్తే ఇచ్చింది కానీ ఏసిబి బుక్ చేసిన ఎఫ్ఐఆర్ లోని అంశాలపై ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో ఎక్కడా వార్తలు, కథనాలు కనబడకూదని హైకోర్టు ఆదేశించటమే ఆశ్చర్యంగా ఉంది. తనకు ముందస్తు రక్షణగా మాత్రమే దమ్మాలపాటి కోర్టుకెళితే మొత్తం ఎఫ్ఐఆర్ విషయాన్ని హైకోర్టు ఎందుకు ప్రస్తావించిందనే విషయమే ఎవరికీ అర్ధంకావటంలేదు. సరే ఈ విషయాన్ని వదిలేస్తే చంద్రబాబుకు మాత్రం బిజెపి బంపర్ ఆఫర్ ఇచ్చినట్లే చెప్పుకోవాలి. భూకుంభకోణంలో ఎంతమంది పాత్రుంది, ఎంతమంది తగులుకుంటారు ? అసలు విచారణ జరుగుతుందా లేదా ? అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్స్ అనే చెప్పాలి.
@ncbn(బాబు) గారికి చక్కటి అవకాశం.
— S. vishnu Vardhan reddy (@SVishnuReddy) September 16, 2020
అమరావతి భూ కుంభకోణం లో (insider trading)లో తనకు సంబందం లేకుంటే @JaiTDP సిబిఐ విచారణ స్వచ్ఛందంగా కోరితే బాగుంటుంది. కడిగిన ముత్యంలా బయటపడొచ్చు.బాబు గారిమీద ప్రజలకు అనుమానాలు తొలగిపోతాయి.#InsiderTrading #CBI #SaveAmaravati
మిగిలిన వాళ్ళ విషయం వదిలేసినా చంద్రబాబు మాత్రం బిజెపి చెప్పినట్లు స్వచ్చందంగా సిబిఐ విచారణను కోరాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తనకు తాను నిప్పునంటూ సర్టిఫికేట్ ఇచ్చుకుంటే సరిపోదుకదా. అవినీతి మచ్చలేని నేతగా తనను తాను చాలాసార్లు అభివర్ణించుకున్నారు. మనభుజాన్ని మనమే చరుకుకుంటే ఉపయోగం ఏముంటుంది ? ప్రస్తుతం తాను ఎలాగూ బిజెపికి దగ్గరవుదామని తెగ ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి ఇపుడు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని నిజంగానే కడిగిన ముత్యంలాగ బయటపడితే ఇంతకన్నా కావాల్సిందేముంటుంది ? అప్పుడు బిజెపినే ఎన్డీఏలో చేరమని ఆఫర్ ఇచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఏమంటారు బాబుగారూ ?