
రాజకీయాల్లో ఒక్కోసారి ఇలాగే అవుతుంటుంది. ప్రస్తుత రాజకీయాలంతా ప్రత్యర్ధులను గబ్బు పట్టించటం మీదే నడుస్తోంది. పాలసీల మీద మాట్లాడటం, ఆచరణ సాధ్యమైన సూచనలు చేయటం లాంటి హుందా రాజకీయాలు ఎప్పుడో మాయమైపోయాయి. పొద్దున లేచిందగ్గర నుండి ప్రత్యర్ధులపై ఎంత బురద చల్లేశాం, దాన్ని కడుక్కోలేక వాళ్ళెంత అవస్తలు పడుతున్నారన్నదే కీలకమైపోయింది. ఈ పద్దతి ఒక రాజకీయపార్టీకో లేకపోతే ఒక నేతకో పరిమితం కాలేదు. దాదాపు అందరు రాజకీయ నేతలు ఒకేలా వ్యవహరిస్తున్నారు. కాబట్టి బీజీపీకి, దాని చీఫ్ సోమువీర్రాజుకు కూడా మినహాయింపేమీలేదు.
రెండు రోజుల క్రితం వీర్రాజు మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నేతనే సీఎం చేస్తుందన్నారు. తమ పార్టీ విధానాన్ని ప్రకటించటమే కాకుండా వైసీపీ, టీడీపీలను ఈ విషయంలో చాలెంజ్ చేశారు. నిజానికి సీఎం, బీసీ అనే అంశాలను ప్రస్తావించాల్సిన అవసరమే వీర్రాజుకు లేదు. ఎందుకంటే ఏపిలో బీజేపీ అధికారంలోకి వచ్చేది లేదు, బీసీని సీఎంగా చేసేదిలేదు. అనవసరమైన విషయాలను కెలెక్కోవటంలో వీర్రాజు చాలా ముందుంటారు. తాను బీసీ కార్డును ప్రయోగిస్తే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడును ఇబ్బందుల్లోకి నెట్టినట్లే అనుకున్నారు. అందుకనే ఒకేసారి రెండు పార్టీల్లో బీసీ మంటలను రాజేద్దామని ప్రయత్నించారు. అయితే మంటలో పెట్రోలు ఎక్కువపడిపోయి ఊహించని విధంగా ఆ మంట వీర్రాజుకే అంటుకున్నది.
ఎప్పుడైతే వీర్రాజు బీసీ మంటను రాజేశారో వెంటనే మిత్రపక్షం జనసేన నుండి సెగ మొదలైంది. ఎందుకంటే మిత్రపక్షాల తరపున సీఎం అభ్యర్దిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ప్రతిపాదించాలనే డిమాండ్లు తెలిసిందే. ఒకవైపు తాము డిమాండ్ చేస్తుంటే మరోవైపు వీర్రాజు బీసీ మంటను రాజేయటం ఏమిటని పవన్ కు మండిపోయిందట. వెంటనే ఇదే విషయాన్ని ఢిల్లీలోని జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మాట్లాడారట. వీర్రాజు ఒంటెత్తు పోకడలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారట. అవసరం లేదనుకున్నపుడు ఆ విషయాన్ని నేరుగా చెప్పేస్తే పొత్తు కట్ చేసుకుంటామని వార్నింగ్ ఇచ్చారట. దాంతో నడ్డా వెంటనే వీర్రాజుపై ఆ కోపాన్నంతా చూపినట్లు సమాచారం. దాంతో ఏమి మాట్లాడాలో తెలీక వీర్రాజు తాను బీసీ ముఖ్యమంత్రి అని అనలేదంటు ఏదో కవరింగ్ కు ప్రయత్నించారు. కాబట్టి మంట పెట్టేటపుడు జాగ్రత్తలు తీసుకోకపోతే అది ఎదురుతిరిగి తమకు కూడా అంటుకునే ప్రమాదం ఉందని గ్రహించాలి.