ఈ జగమందు సప్త చిరంజీవులలో హనుమంతుడు ఒకరు. అలాంటి హనుమంతుడు లేకపోతే రామాయణం పరిపూర్ణం కాద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అతణ్ణి మహాహలుడు, బుద్ధిశాలి, కపిశ్రేష్టుడు, సర్వశాస్త్ర పారంగతుడు, స్వామిభక్తి పరాయణుడు, రామదూత అంటూ ఎన్నోవిధాలుగా ప్రస్తుతిస్తారు. అర్జునునికి ప్రియ సఖుడు.. శ్రీరామ దాసుడు. ఎర్రని కన్నులుగల వానరుడు. అమిత విక్రముడు. శతయోజన విస్తారమైన సముద్రాన్ని దాటినవాడు. లంకలో బందీయైన సీతమ్మ శోకాన్ని హరించినవాడు. అలాంటి హ‌నుమంతుడి గుడి లేని ఊరు అంటే అరుదే అని చెప్పుకోవాలి. 

 

అయితే ప్ర‌సిద్ధి పొందిన హ‌నుమంతుడి ఆల‌యాల్లో హైదరాబాద్‌లోని కర్మన్‌ ఘాట్‌లోని ఆంజనేయ స్వామి ఆల‌యం కూడా ఒక‌టి. లయం క్రీస్తు శకం 1143 ప్రాంతంలో నిర్మితమైంది. దీనికి సంబంధించిన స్థల పురాణం ఒకటుంది.  కాకతీయ ప్రభువైన రెండవ ప్రతాపరుద్రణుకు వేట చాలా ఇష్టమైన అలవాటుగా ఉండేది. ఈ రోజు మనం హైదరాబాదుగా పిలుచుకుంటున్న ఈ ప్రాంతాన్ని ఆ రోజుల్లో లక్ష్మీపురం అనే పేరుతో పిలవబడుతూ అడవిగా ఉండేది. ఇక  ప్రభువైన రెండవ ప్రతాపరుద్రణుడు వేటకు వెళ్లి, కొంతసేపు విశ్రాంతి కోసం ఒక చెట్టు కింద కూర్చున్నార‌ట‌.

 

అయితే ఆయనకు దట్ట్టమైన అడవి మధ్య రామనాయం వినిపించిందని, అది ఎక్కడి నుంచి వస్తోందో నని తెలుసుకోవడానికి వెళ్లగా కూర్చుని ఉన్న హనుమంతుని విగ్రహం కనబడిందని చెబుతారు. రాజు ఆ విగ్రహానికి మొక్కి ఇంటికి వచ్చాడు. ఆ రోజు రాత్రి ఆంజనేయుడు అయనకు కలలో కనబడి తనకు ఆలయం కట్టమని కోరాడని చెబుతారు. దీంతో రాజు తక్షణం అక్కడ ఆలయం నిర్మించాడు. అక్కడ ఆంజనేయుడు కూర్చున్న రూపంలో ఉన్నందున ఆయనను ధ్యానాంజ నేయ స్వామి అని పిలుస్తారు. ఆ తర్వాతి రాజులు ఆ ఆలయాన్ని సంరక్షించారు. ఔరంగజేబు ఒక పర్యాయం ఈ ఆలయాన్ని కూలగొట్టబోగా ‘మందిర్‌ తోడ్‌నా హైతో రాజన్‌, తో కర్‌ మన్‌ ఘాట్‌’ (ఆలయాన్ని కూల్చదల్చుకుంటే ముందు నీ గుండెను దిటవు చేసుకో) అని ఒక పెద్ద గర్జన వినిపించిందని చెబుతారు. దానితో ఔరంగజేబు వెనక్కు తిరిగి వెళ్ళాడు.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: