
ఇది బుమ్రాకి టెస్ట్ క్రికెట్‌లో 14వ ఐదు వికెట్ల ప్రదర్శన కాగా, ఇందులో ఏకంగా 12 సార్లు విదేశీ గడ్డపైనే ఈ ఫీట్ సాధించడం విశేషం. ఈ ఘనతతో, విదేశీ టెస్టుల్లో అత్యధిక సార్లు ఐదు వికెట్లు తీసిన భారత బౌలర్‌గా లెజెండరీ కపిల్ దేవ్ రికార్డును సమం చేశాడు. మన బుమ్రా ఇప్పుడు కపిల్ పక్కన నిలిచాడు.
అంతేకాదు, బుమ్రా మరో అరుదైన మైలురాయిని కూడా అందుకున్నాడు. 'సేనా' (SENA) దేశాల్లో (అంటే దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) ఏకంగా 150 టెస్ట్ వికెట్లు పడగొట్టి, ఈ దేశాల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆసియా బౌలర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో, 146 వికెట్లతో ఉన్న పాకిస్థాన్ దిగ్గజం వసీం అక్రమ్‌ను కూడా వెనక్కి నెట్టేశాడు. బుమ్రా దెబ్బంటే అట్లుంటది మరి!
విదేశాల్లో భారత్ తరఫున అత్యధిక ఐదు వికెట్ల ప్రదర్శనలు
జస్ప్రీత్ బుమ్రా – 12
కపిల్ దేవ్ – 12
అనిల్ కుంబ్లే – 10
ఇషాంత్ శర్మ – 9
ఆర్ అశ్విన్ – 8
సేనా దేశాల్లో ఆసియా బౌలర్ల అత్యధిక వికెట్లు
బుమ్రా – 150 వికెట్లు (31 మ్యాచ్‌లు)
వసీం అక్రమ్ – 146 (32)
అనిల్ కుంబ్లే – 141 (35)
ఇషాంత్ శర్మ – 127 (40)
జహీర్ ఖాన్ – 119 (30)
మ్యాచ్ విషయానికొస్తే, రెండో రోజు ఆటలో బుమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు. మూడో రోజు ఉదయం సెషన్‌లో కాస్త వికెట్ల కోసం ఎదురుచూసినా, ఆ తర్వాత మాత్రం బలంగా పుంజుకుని ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. ప్రసిధ్ కృష్ణ 106 పరుగులు చేసిన ఓలీ పోప్‌ను పెవిలియన్ చేర్చగా, మన హైదరాబాదీ సిరాజ్, డేంజరస్ బెన్ స్టోక్స్ వికెట్‌ను తీశాడు. మధ్యలో ఇంగ్లాండ్ బ్యాటర్లు హ్యారీ బ్రూక్, జామీ స్మిత్ కాసేపు ఎదురుదాడికి దిగి 73 పరుగులు జోడించారు. కొన్ని పేలవమైన ఫీల్డింగ్, జారవిడిచిన క్యాచ్‌లు భారత్‌ను కాస్త దెబ్బతీసినప్పటికీ, బుమ్రా స్పెల్ మాత్రం మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది.