మనం జ్వరం తగ్గడానికి వేసుకునే పారాసెటమాల్ ను, పాములను చంపడానికి వాడుతోంది అమెరికా. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. అమెరికాకు చెందిన గువాం దీవిలో బ్రౌన్ ట్రీ స్నేక్ జాతి పాములను చంపేందుకు పారాసెటమాల్ ను వాడుతోంది అక్కడి ప్రభుత్వం. గువాం దీవిలో ఉండే బ్రౌన్ ట్రీ స్నేక్ జాతి పాములను చంపడానికి 80 మి.గ్రా.పారాసెటమాల్ ను వాడుతోంది అమెరికా. చనిపోయిన చిన్నచిన్న ఎలుకలకు  80 మి.గ్రా.చొప్పున పారాసిటమాల్ ను ఇంజెక్ట్ చేస్తారు. వాటిని కాట్ బోర్డ్ పారాచుట్ లకు అంటించి హెలికాప్టర్ ద్వారా అడవుల్లోని చెట్ల మీద వదులుతారు.

ఎక్కువగా చెట్ల మీద ఉండే బ్రౌన్ ట్రీ పాములు ఆ కొమ్మలకు అంటుకున్న కాట్ బోర్డ్ పారాచూట్ కు ఉండే ఎలుకలను తింటాయి. ఎలుకల్లో ఉండే పారాసెటమాల్ వల్ల కొన్ని గంటల్లో ఆ పాములు చనిపోతాయి. పాములు చనిపోతున్నాయో లేదో తెలుసుకునేందుకు కొన్ని ఎలుకల్లో ట్రాకర్స్ ను అమర్చుతోంది యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్. సుమారు 3 మీ. పొడవుండే బ్రౌన్ ట్రీ స్నేక్స్ తో యుద్ధమే చేస్తోంది అమెరికా. ఇందుకు ఏటా 8 మిలియన్ డాలర్లు అంటే సుమారు 60 కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. వన్య ప్రాణులను కాపాడాల్సిన ప్రభుత్వం బ్రౌన్ ట్రీ స్నేక్స్ ని ఎందుకు చంపుతోంది. ఇందుకు కారణం అది చేస్తున్న నష్టమే. పశ్చిమ పసిఫిక్ లో ఉండే గువాం దీవిలో వాటి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. స్థానికంగా ఉండే అనేక రకాల జీవజాతులను అవి అంతం చేస్తున్నాయి. 11 జాతుల పక్షుల్లో 9 జాతులు అంతరించి పోవడానికి కారణం బ్రౌన్ ట్రీ  స్నేకే. తొండలు,గబ్బిలాలు వంటి వాటి మనుగడ ప్రమాదంలో పడింది.

 విద్యుత్ స్తంభాలు తీగల్లో ఈ పాములు చిక్కుకోవడంతో తరచూ పవర్ ఫెయిల్యూర్ సమస్యలు తలెత్తుతున్నాయి. గువాం పవర్ అథారిటీకి ఏడాదికి 4 మిలియన్ డాలర్లకు పైగా నష్టం వస్తోంది. ఈ కారణాల వల్ల బ్రౌన్ ట్రీ స్నేక్స్ జాతిని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తోంది అమెరికా. విదేశాలకు చెందిన ఈ జాతి పాము సుమారు 70 ఏళ్ల కిందట గువాం దీవికి చేరింది. ఆ దీవి నుంచి రాకపోకలు సాగించే సమయంలో సరుకు రవాణా ఓడల ద్వారా ఆ పాము గువాం కు చేరివుంటుందని అంచనా. బ్రౌన్ ట్రీ స్నేక్ ను గువాం దీవికి మాత్రమే పరిమితం చేయాలన్నది అమెరికా లక్ష్యం. అందుకే గువాం లోని ఎయిర్ పోర్ట్, పోర్టు లలో గట్టి నిఘా ఉంచుతోంది. విమానాల ద్వారా లేదా ఓడల ద్వారా ఆ పాము దీవి నుంచి బయటకు రాకుండా చూస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: