కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌కు అమ్ముడుపోయార‌ని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే టీఆర్ఎస్‌కు వేసిన‌ట్టే అని వైఎస్ఆర్టీసీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల పేర్కొన్నారు. సోమ‌వారం న‌ల్ల‌గొండ జిల్లాలోని దేవ‌ర‌కొండ నియోజ‌క‌వ‌ర్గం చింత‌ప‌ల్లి మండ‌లంలో పాద‌యాత్ర చేప‌ట్టారు. ష‌ర్మిల చేప‌డుతున్న ప్ర‌జా ప్ర‌స్తానం మ‌హాపాద‌యాత్ర 13వ రోజు మాల్ టౌన్ నుంచి ప్రారంభం అయింది.

పోలేప‌ల్లి గ్రామం మీదుగా ఎర్ర‌మ‌ట్టితండా, బోటిమెడ తండా, పాలెం తండా, చౌల తండా, చాక‌లి షేర్‌ప‌ల్లి గ్రామానికి చేరుకున్న‌ది. మార్గ‌మ‌ధ్య‌లో వ‌ర్షం కురిసిన‌ప్ప‌టికీ పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తూ రైతుల‌ను స్థానిక ప్ర‌జ‌ల‌ను క‌లుసుకుంటూ ముందుకు సాగారు. పాద‌యాత్ర‌లో నిర్వ‌హించిన మాట ముచ్చ‌ట కార్య‌క్ర‌మంలో ష‌ర్మిల మాట్లాడారు. అర్హులైన ప్ర‌తీ ఒక్క‌రికీ పెన్ష‌న్, తెల్ల‌రేష‌న్ కార్డు ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. ఉద్యోగ నోటిఫికేష‌న్ రాక నిరుద్యోగి మ‌హేష్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని గుర్తుచేశారు. నిరుద్యోగులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నా.. సీఎంలో చ‌ల‌నం క‌నిపించ‌డం లేద‌ని ఆమె దుయ్య‌బ‌ట్టారు.  రాజ‌న్న బిడ్డ‌గా తెలంగాణ ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డం త‌న హ‌క్కు కాదా అని ష‌ర్మిల ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. అదేవిధంగా రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామ‌కాలు అన్నీ కేసీఆర్ కుటుంబానికేనా అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: