టాలీవుడ్ సీనియర్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కు నాలుగు రోజుల కింద‌ట క‌రోనా సోకింది.  ఆయనతో పాటు ఆయన కుటుంబ స‌భ్యులు  కరోనా బారిన పడ్డ‌ట్టూ తెలుస్తోంది. ప్రస్తు తం శివశంకర్ మాస్టర్ గచ్చిబౌలిలోని ఏఐజీ  హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్న‌ట్టు సమాచారం.

కోవిడ్ బారినపడ్డ శివశంకర్ మాస్టర్‌  నాలుగు రోజుల నుంచి హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స  తీసుకుంటున్నారు.  కరోనా ప్ర‌భావంతో ఆయ‌న ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తున్నట్టు తెలుస్తున్న‌ది. ఆయన ఊపిరితిత్తులకు 75 శాతం ఇన్ఫెక్షన్ సోకినట్లు అక్కడి వైద్యులు వెల్ల‌డించారు.  మరోవైపు శివశంకర్ భార్యకు కూడా కరోనా సోకడంతో ఆమె హోమ్ క్వారంటైన్‌లో ఉన్న‌ది. అదేవిధంగా పెద్ద కుమారుడు కరోనా సోకి అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. శివశంకర్ మాస్టర్, ఆయన కుమారుని చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుండటంతో దాతల సాయం కోసం ఆ కుటుంబం ఎదురు చూస్తున్న‌ది.

 శివ శంకర్ మాస్టర్ డాన్స్‌‌కి తెలుగులోనే కాకుండా తమిళ్‌లోనూ మంచి క్రేజ్  ఉన్న‌ది. ‘మగధీర’, ‘బాహుబలి’, ‘అత్తారింటికి దారేది’ ఇలా వందలాది చిత్రాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేశారు శివ‌శంక‌ర్ మాస్ట‌ర్‌. ఆయ‌న  ఎన్నో అవార్డులను కూడా అందుకున్నారు. కేవ‌లం డాన్స్ మాస్టర్ గా కాకుండా నటుడుగా  పలు సినిమాలలో న‌టించారు మాస్ట‌ర్‌.


మరింత సమాచారం తెలుసుకోండి: